చివరిరోజు రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం.. ఎవరెవరిని కలిశారంటే..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-28 06:43:21.0  )
చివరిరోజు రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం.. ఎవరెవరిని కలిశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారానికి చివరి రోజైన మంగళవారం డెలివరీ బాయ్స్, ఆటో డ్రైవర్లు, జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, గిగ్ వర్కర్లతో భేటీ అయ్యారు. వారి సాధకబాధలు శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగులను అధికారులు వేధిస్తున్నారని సిబ్బంది ఆరోపించారు. తమకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లు 11 గంటలు పనిచేయిస్తున్నారని కార్మికులు తెలిపారు.

సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమంటున్నారని ఆవేదన చెందారు. ఈ సందర్భంగా రాహుల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కాంగ్రెస్ గెలవగానే.. కార్మికులతో సీఎం సమావేశం అవుతారన్నారు. డెలివరీ బాయ్స్, క్యాబ్, ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. పోలీసులు చలాన్లతో వేధిస్తున్నారన్నారు. తరచూ ప్రమాదాల బారినపడుతున్నామని డెలివరీ బాయ్స్ సైతం తమ బాధను రాహుల్‌కు చెప్పారు. తమకు ప్రమాద బీమా కల్పించాలని డెలివరీ బాయ్స్ రాహుల్ గాంధీని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతానని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story