లిక్కర్ స్కాంతో కవితకు లింకు.. ఫొటోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-07 08:08:17.0  )
లిక్కర్ స్కాంతో కవితకు లింకు.. ఫొటోలు బయటపెట్టిన ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రమచంద్ర పిళ్లైతో కలిసి కేసీఆర్ పుట్టిన రోజున ఎమ్మెల్సీ కవిత తిరుమల వెళ్లారని రఘునందన్ రావు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన మీడియాకు చూపించారు. బుధవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పిళ్లై కంపెనీల్లో కవిత డైరెక్టర్ గా ఉన్నారని పలు పేపర్లలో వచ్చిన కథనాలు చెబుతున్నాయని అన్నారు.

లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదన్న కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమల వెళ్లడం అబద్దమా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈడీ సోదాలు చేపట్టిన వారికి తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న కవిత.. తన కుటుంబ కార్యక్రమంలో అభిషేక్ రావు, రామచంద్ర పిళ్లై ఎందుకు వచ్చారో చెప్పాలని అన్నారు. ఈడీ అనేది బీజేపీకి చెందిన సొంత సంస్థ కాదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ ఎంపీలు తాము మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నారని, సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయటకు వస్తాయన్నారు.

మరమనిషి అనే పదమేమైనా నిషేదితమా?

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసి వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సభలో బీజేపీ గొంతు వినిపించకుండా ఉండేందుకే తమను ఏదో ఓ కారణంతో సభ నుండి బయటకు పంపించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. 'మరమనిషి' అనే వ్యాఖ్యపై ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. గతంలో స్పీకర్ ను ఉద్దేశించి పోచారం మాట్లాడిన రికార్డ్స్ తమ వద్ద ఉన్నాయని అన్నారు. మీరిచ్చే నోటీసులు చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీఏసీ సమావేశానికి బీజేపీని పిలవకపోవడాన్ని రఘునందన్ రావు ఆక్షేపించారు.

గతంలో ఒక్క శాసనసభ్యుడు ఉన్న పార్టీలను సైతం బీఏసీ సమావేశానికి ఆహ్వానించారని, కానీ ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని ఎందుకు ఆహ్వానించలేదని అన్నారు. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే బీఏసీకి పిలుస్తామని ఏదైనా సభ రూల్స్ మార్చారా? అని స్పీకర్ ను ప్రశ్నించారు. అలాంటి మార్పులు ఉంటే దయచేసి కొత్త వాడినైన తనకు చెప్పాలని అన్నారు. ప్రజాసమస్యలను మాట్లాడకుండా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే సీఎం కేసీఆర్ కు ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ పేరుతో సభలో ఏది చేసినా అది చెల్లుబాటు అయితే ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం గొంతెత్తుతున్న బీజేపీది కూడా రైటే అన్నారు.

ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో స్పీకర్ మరమనిషిలా వ్యవహరిస్తున్నారనే మాటపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పడంపై రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నారు. భారత రాజ్యాంగం మరమనిషి అనే పదాన్ని నిషేధించిందా? అని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఉద్దేశించి అంతర్జాతీయ మీడియా మరమనిషి అని చెప్పలేదా? అప్పుడు రైట్ అయింది ఇప్పుడు ఎందుకు రాంగ్ అవుతోందని నిలదీశారు.

ఇదే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని ఇంతకంటే దిగజారి మాటలు అనలేదా అని అన్నారు. భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. బయటకు వచ్చి భట్టి విక్రమార్క చెప్పడం కాదని, 20 రోజులు సభ నిర్వహించకుంటే కాంగ్రెస్ సభను బాయ్‌కాట్ చేస్తామని ఎందుకు భట్టి విక్రమార్క బీఏసీలో డిమాండ్ చేయలేదన్నారు. బీఏసీ సమావేశానికి బీజేపీని ఎందుకు పిలవలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించ లేదెందుకని నిలదీశారు.

Also Read : బిగ్ బ్రేకింగ్.. కవిత సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు?

Advertisement

Next Story