800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన గొప్ప వ్యక్తి పీవీ.. : KTR

by Rajesh |
800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసిన గొప్ప వ్యక్తి పీవీ.. : KTR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజల ఆకాంక్ష, బీఆర్ఎస్ రిక్వెస్ట్ మేరకు భారత మాజీ ప్రధాని పీపీకి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు కేటీఆర్ కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు. పీవీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పివి అన్నారు. ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా పీవీ ని చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదు అన్నారు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు. తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి పీవీ అని కొనియాడారు.

ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగారని పేర్కొన్నారు. పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని కొనియాడారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక ఆర్థిక వేత్తను తీసుకువచ్చి ఆర్థిక మంత్రిగా నియమించుకొని అద్భుతంగా ఆర్థిక సంస్కరణలను చేపట్టారని తెలిపారు. 16 భాషల్లో అద్భుతమైన భాషా ప్రావీణ్యం ఉన్నా కొన్నిసార్లు, తన మౌనమే తన భాషగా గొప్ప పాలన నిర్వహించారని గుర్తు చేశారు. తన సొంత 800 ఎకరాల కుటుంబ భూమిని ప్రభుత్వానికి అప్పగించి దేశంలో కీలకమైన భూసంస్కరణలను ప్రారంభించారని తెలిపారు. దేశంలో నవోదయ పాఠశాలలు, గురుకులాలు పెట్టి విద్యారంగానికి ఎనలేని సేవలు చేశారని చెప్పారు.

పివీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని... ఆయన నిత్య విద్యార్థి, 80 ఏళ్ల వయసులో కంప్యూటర్ విద్య నేర్చుకున్న వ్యక్తి మనందరి జీవితాలకు ఆదర్శం అన్నారు. ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు గొప్పగా నడిపిన వ్యక్తి పీవీ అని ప్రశంసించారు. తమ పార్టీ తరఫున అపురూపంగా ఆయన శతజయంతి ఉత్సవాలను నిర్వహించామని గుర్తు చేశారు. కేవలం దేశంలోనే కాకుండా దేశ, విదేశాల్లోనూ ప్రవాస భారతీయులందరినీ కలుపుకొని ఘనంగా వేడుకలు నిర్వహించామన్నారు. పీవీ నరసింహారావు పేరుని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న నెక్లెస్ రోడ్డుకి నామకరణం చేయడం జరిగిందన్నారు. ఘనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. పీవీ నరసింహారావు జీవితాన్ని కేంద్రం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి మాట్లాడుతూ..

పీవీ నరసింహారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వెనకబడిన ప్రాంతమని చెప్పుకునే రోజుల్లోనే, తెలంగాణ నుంచి ఒక అపర మేధావిగా, అపర చాణక్యుడిగా, అద్భుతమైన రాజకీయ నాయకుడిగా సమస్యల వలయంలో ఉన్న దేశాన్ని పీవీ చక్కదిద్దగలిగారన్నారు. పీవీ నరసింహారావుకి భారతరత్న దక్కడం, ఆయన సేవలను దేశం గుర్తించడం మొత్తం తెలంగాణకే గౌరవం అన్నారు.ఇలాంటి మహానుభావుని సమాజం మర్చిపోతుంది అనుకుంటున్న సమయంలో కేసీఆర్ , పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఆయన ఘనతను, ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి తెలియజేసేలా చేశారన్నారు. కేసీఆర్‌కు పీవీ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed