టైంకు యూనిఫాం అందించండి : Minister Sabitha Indra Reddy

by samatah |   ( Updated:2022-11-29 15:29:38.0  )
టైంకు యూనిఫాం అందించండి :  Minister Sabitha Indra Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే ఏకరూప దుస్తులను అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఏకరూప దుస్తులను ధరించి తరగతులకు హాజరైతే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుందని పేర్కొన్నారు. మంగళవారం పాఠశాల విద్య సంచాలకులు కార్యాలయంలో ఏకరూప దుస్తుల పంపిణీ, మన ఊరు - మన బడి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

రానున్న విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి 25 లక్షల మంది విద్యార్థులకు 121 కోట్ల రూపాయలతో ఏకరూప దుస్తులను రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులందరూ ఒకే రకమైన దుస్తులు ధరించడం ద్వారా వారి మధ్య తారతమ్యాలు, ఎలాంటి కల్మషాలకు తావు లేకుండా ఉండే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మన ఊరు - మన బడి కార్యక్రమంలో మొదటి దశలో చేపట్టిన పాఠశాలల్లో 1200 పాఠశాలల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో సీసీ కెమెరాలు, ఫర్నీచర్, ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాలను డిసెంబర్ 15 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మిగతా పాఠశాలల్లో కూడా పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story