- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ‘హైడ్రా’ ఫస్ట్ ప్రయారిటీ: సీఎం రేవంత్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం, చెరువులతో పాటు నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేయడం, ఆక్రమణలను తొలగించడం, నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొచ్చిన ఫ్లెక్సీలు, హోర్డింగులను తీసేయడం.. ఇలాంటివన్నీ ఇప్పుడు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్) చేపట్టనున్నది. హైదరాబాద్ సిటీ మొదలు ఔటర్ రింగు రోడ్డు వరకు దాదాపు రెండు వేల చదరపు కి.మీ. మేర ఉన్న ప్రాంతమంతా హైడ్రా పరిధిలోకి రానున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ట్రాఫిక్ పోలీసు, సిటీ పోలీస్, విజిలెన్స్, విద్యుత్ తదితర పలు విభాగాల సమన్వయంతో ఈ కొత్త వ్యవస్థ పనిచేయనున్నది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) విభాగానికి ప్రత్యామ్నాయంగా ‘హైడ్రా’ వ్యవస్థ ఉనికిలోకి వస్తున్నది.
రోజురోజుకూ విస్తరిస్తున్న హైదరాబాద్ నగర ప్రజల అవసరాలకు, మెరుగైన సేవలందించేందుకు వీలుగా ‘హైడ్రా’ పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించిన సీఎం రేవంత్.. దీని ఫంక్షనింగ్, నిర్వహణా వ్యవస్థ, నిర్మాణం, సిబ్బంది సంఖ్య, విధివిధానాలు తదితరాలపై లోతుగా అధ్యయనం చేసి ముసాయిదా నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష సందర్భంగా అనేక అంశాలను వివరించి భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఎలాంటి పనిచేయనున్నదో దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ మొదలు విద్యుత్ శాఖ వరకు అనేక విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా పని చేసేలా ఉండాలని నొక్కిచెప్పారు. ఇప్పుడున్న ఈవీడీఎం విభాగాన్ని దానికి అనుగుణంగా పునర్ వ్యవస్థీకరించాలన్నారు.
కొత్తగా ఏర్పడుతున్న ‘హైడ్రా’ విభాగంలో ఏయే స్థాయి అధికారులుండాలి.. ఎంతమంది సిబ్బంది ఉండాలి.. ఏయే విబాగాల నుంచి డిప్యుటేషన్ మీద తీసుకోవాలి.. ఎక్కడెక్కడ జోనల్ కార్యాలయాలను నెలకొల్పాలి.. ప్రజలకు నిత్యం కనెక్టివిటీలో ఉండడానికి అనుసరించాల్సిన విధానం.. తదితర అంశాలపై స్పష్టమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2 వేల చ.కి.మీ. పరిధిలో హైడ్రా పని చేయాల్సి ఉంటుందని, ఆ పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని సీఎం సూచించారు. హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని అవసరాన్ని బట్టి పరిశీలించాలన్నారు. ఈ నెల చివర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి ముసాయిదా తయారు కావాలన్నారు.
విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్తు సప్లై తదితర అంశాలపైనా ‘హైడ్రా’ కీలకంగా వ్యవహరించేలా విధుల అప్పగింత ఉంటుందన్నారు. హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ విభాగాల మధ్య నిత్యం సమన్వయం ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కనిపిస్తున్న అనధికారిక హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగింపుతో పాటు జరిమానా వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలన్నారు. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని అధికారులకు నిర్దిష్టంగా సూచించారు.
గతంలోనే ‘హైడ్రా’ ఏర్పాటుపై వివిధ విభాగాల అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చించి సూచనలు చేసిన సీఎం రేవంత్.. వీలైనంత తొందరగా ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభించేలా కసరత్తును ముమ్మరం చేశారు. సిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు విభాగాల సమన్వయంతో పటిష్టవంతంగా పనిచేయడమే లక్ష్యంగా ఈ కొత్త మెకానిజం రూపుదిద్దుకుంటున్నారు. విభాగాల మధ్య ఇంతకాలం సమన్వయం లేకపోవడంతో జరిగిన జాప్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటిది రిపీట్ కాకుండా కొత్త వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. హైడ్రా విధివిధానాలపై సమీక్ష సందర్భంగా చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ రంగనాథ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.