విద్యుత్ చార్జీల పెంపుకు డిస్కమ్‌ల ప్రతిపాదనలు..రూ.1200 కోట్ల ఆదాయం లక్ష్యం

by Y. Venkata Narasimha Reddy |
విద్యుత్ చార్జీల పెంపుకు డిస్కమ్‌ల ప్రతిపాదనలు..రూ.1200 కోట్ల ఆదాయం లక్ష్యం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ప్రతిపాదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ ఆర్ ) బుధవారం అర్థరాత్రి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీజీ ఈఆర్సీ)కి సమర్పించబడింది. మూడు కేటగిరీల్లో చార్జీలను సవరించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. సిఫార్సులను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించినట్లయితే.. లోటును భర్తీ చేసేందుకు రూ.1200 కోట్ల ఆదాయం వస్తుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం గృహా వినియోగదారులు వినియోగించే విద్యుత్ నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.50కి పెంచేందుకు అనుమతించాలని డిస్కమ్ లు కోరాయి. విద్యుత్‌ చార్జీలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. చార్జీల సవరణల ప్రతిపాదనలపై రాష్ట్రంలో కనీసం మూడు చోట్ల ప్రజల సమక్షంలో పబ్లిక్ హియరింగ్‌లు నిర్వహించిన తర్వాత ఈఆర్‌సీ తుది నిర్ణయం ప్రకటిస్తుంది. ఆ తర్వాతే చార్జీల సవరణ అమలులోకి వస్తుంది. ఈ మొత్తం ప్రక్రియకు 90 రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు.

సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్), నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీజీఎన్పీడీసీఎల్) ఈ ఏడాది తమ ఆదాయ వ్యయాల మధ్య రూ.14,222 కోట్ల లోటును అంచనా వేసింది. ఇందులో ఎస్పీడీసీఎల్‌ వాటా రూ.8093 కోట్లు కాగా, ఎన్పీడీసీఎల్‌ వాటా రూ.4929 కోట్లు. ఈ మొత్తంలో రూ. 13,022 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా అందించాలని కోరింది. మిగిలిన రూ.1200కోట్ల లోటును భర్తీ చేసేందుకు ఛార్జీల సవరణకు ప్రతిపాదనలు ఇస్తున్నట్లు డిస్కమ్ లు తెలిపాయి. ఇందుకు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక, టారిఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి.

హెచ్‌టీ కేటగిరీలో విద్యుత్‌ చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.800 కోట్ల పెంపును ప్రతిపాదించాయి. మిగిలిన రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకునే అవకాశమివ్వాలని కోరాయి. అయితే ఎల్టీ కేటగిరీలోని ఇతర వినియోగదారులకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపునకు కూడా డిస్కమ్‌లు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. లోటెన్షన్‌ కేటగీరీలోకి గృహాలు, గృహేతర/వాణిజ్య, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు, వీధి దీపాలు, తాగుటి సరఫరా పథకాలు, సాధారణ వినియోగదారులు వస్తుండగా, వీటికి సంబంధించిన ఫిక్స్‌డ్‌ చార్జీలు మాత్రమే పెరగనున్నాయి. విద్యుత్‌ చార్జీలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.

300 యూనిట్లు దాటిన వారిపై పడనున్న భారం

ప్రస్తుతం గృహా వినియోగదారులు వినియోగించే విద్యుత్ నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు రూ.10 ఫిక్స్‌డ్ చార్జీగా వసూలు చేస్తున్నారు. దీనిని రూ.50కి పెంచేందుకు అనుమతించాలని డిస్కమ్ లు కోరాయి. ప్రస్తుతం గృహ కనెక్షన్ల లోడ్‌ సామర్థ్యం (కాంట్రాక్ట్‌డ్‌ లోడ్‌) ఆధారంగా ప్రతి కిలోవాట్‌ (కేడబ్ల్యూ) లోడ్‌కు రూ.10 చొప్పున ఫిక్స్‌డ్‌ చార్జీలు విధిస్తున్నారు. దీంతో నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ చార్జీల కింద రూ.30 భారం పడుతోంది. అయితే ఇకపై ఈ చార్జీలను కిలోవాట్‌కు రూ.10 నుంచి రూ.50కి పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే నెల విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లకు మించిన వారికి ఫిక్స్‌డ్‌ చార్జీలు రూ.150కి పెరగనున్నాయి. ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్లలోపు వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తోంది. అలాగే 299 యూనిట్ల వరకు ఉన్న ఇళ్లకు లైన్ చార్జీ పెంపు ఉండదు. డిస్కమ్‌ల ప్రకారం రాష్ట్రంలో 1.30 కోట్లకు పైగా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వారిలో 80 శాతానికి పైగా 300 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నందున, ఫిక్స్‌డ్(డిమాండ్‌ చార్జీ) చార్జీల పెంపు చాలా మందికి భారం కాదని డిస్కమ్‌లు తెలిపాయి.

హైటెన్షన్‌ వినియోగదారులకు డబుల్ షాక్

ఎల్టీ కేటగిరీకి ఫిక్స్‌డ్‌ చార్జీలు మాత్రమే పెరగనుండగా, హైటెన్షన్‌ (హెచ్‌టీ) కేటగిరీ వినియోగదారులకు మాత్రం విద్యుత్‌ బిల్లులు షాక్‌ ఇవ్వబోతున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో ఇటు విద్యుత్‌ చార్జీలు, అటు ఫిక్స్‌డ్‌ చార్జీలు రెండూ పెరగబోతున్నాయి. హెచ్‌టీ కేటగిరీలో 11కేవీ, 33 కేవీ, 132 కేవీ/ఆపై సామర్థ్యం .. అనే మూడు ఉప కేటగిరీల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, మూడింటికీ వేర్వేరు చార్జీలను విధిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికన్నా 11 కేవీ కనెక్షన్ల చార్జీలు అధికంగా ఉన్నాయి. అయితే ఇకపై మిగిలిన రెండు కేటగిరీల చార్జీలు కూడా 11కేవీ కనెక్షన్ల చార్జీలకు సమానమయ్యేలా.. 33కేవీ కనెక్షన్లకు యూనిట్‌ విద్యుత్‌పై అర్ధరూపాయి వరకు, 132కేవీ/ఆపై సామర్థ్యం కలిగిన కనెక్షన్లకు రూపాయి వరకు పెంచనున్నారు. హెచ్‌టీ కేటగిరీలో పరిధిలోకి.. సాధారణ పరిశ్రమలు, లైట్స్‌ అండ్‌ ఫ్యాన్స్‌, కోళ్ల ఫారాలు, సీజనల్‌ పరిశ్రమలు, ఫెర్రో అల్లయ్‌ యూనిట్లు, ఇతరులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లు, ఇతర వినియోగదారులు ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed