Railways: ట్రాక్‌పై 6 మీటర్ల ఇనుప రాడ్.. ఎఫ్ఐఆర్ నమోదు: రైల్వే సిబ్బంది

by S Gopi |
Railways: ట్రాక్‌పై 6 మీటర్ల ఇనుప రాడ్.. ఎఫ్ఐఆర్ నమోదు: రైల్వే సిబ్బంది
X

దిశ, నేషనల్ బ్యూరో: రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి కుట్ర జరుగుతోందని రైల్వే శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌ రోడ్‌, రుద్రాపూర్‌ నగరాల మధ్య రైల్వే ట్రాక్‌లపై ఆరు మీటర్ల పొడవున్న ఇనుప రాడ్‌ కనిపించిందని, అది విధ్వంసానికి కుట్ర అని రైల్వేశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాడ్‌ను గుర్తించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేసి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ఇటీవల రైళ్ల పట్టాలను తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం అలాంటి ఘటనే జరిగింది. రైలు నంబర్ 12091 లోకో పైలట్ 6 మీటర్ల పొడవున్న ఇనుప స్తంభాన్ని కనుగొన్నట్లు రుద్రపూర్ సిటీ స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. డ్రైవర్ రైలును ఆపి, ట్రాక్‌ను క్లియర్ చేసి, రైలును సురక్షితంగా వెళ్లే చర్యలు తీసుకున్నారని భారతీయ రైల్వే పేర్కొంది. దీనికి సంబంధించి పేరు తెలియని వ్యక్తులపై రైల్వే చట్టం 1989లోని సెక్షన్ల కింద జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ రాంపూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల ప్రారంభంలో కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో లోడ్ చేయబడిన గూడ్స్ రైలును పట్టాలు తప్పించే ప్రయత్నాలు జరిగాయి. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ట్రాక్‌లపై దుండగులు రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచారు. రైలు సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టింది కానీ ప్రమాదమేమీ జరగలేదు. అంతకు ముందు, యూపీలోనే కాన్పూర్‌లో భివానీ-ప్రయాగ్‌రాజ్ కాళింది ఎక్స్‌ప్రెస్‌ వెళ్లే ట్రాక్‌లపై ఎల్‌పీజీ సిలిండర్‌తో పాటు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెలను ఉంచి పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగింది. కానీ, ఎల్‌పీజీ సిలిండర్‌ను ఢీకొన్న తర్వాత రైలును నిలిపివేశారు. వరుస ఘటనలపై పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలు విచారణ జరుపుతున్నాయని రైల్వే శాఖ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed