‘ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలి’

by Rajesh |
‘ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : అన్ని ప్రభుత్వ శాఖలకు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి సీఎస్‌ను కోరారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఏప్రిల్ లో ఇంటిపన్ను చెల్లించిన వారికి ఆ పన్నులో 5శాతం రిబేట్ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించిన తర్వాత హైదరాబాద్ లో సుమారు 8 లక్షల మంది 786.75కోట్ల ఆస్తిపన్ను చెల్లించారన్నారు. ఈ పన్నులతో నాలాలు, రోడ్ల మరమ్ముతు పనులు చేపడతారని ప్రజలు ఆశించారని కానీ ఉద్యోగుల జీతాలకే సరిపోతుందన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఏళ్లుగా పన్ను బకాయి చెల్లించడం లేదన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5560కోట్లు కాగా, కేంద్రం 371కోట్లు మొత్తం 5935కోట్లు బకాయి ఉందన్నారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో కొన్నిశాఖలు 8కోట్ల మేర బకాయి పన్నులు చెల్లించారని, ఇంకా వేలల్లో బకాయి పెండింగ్ లోనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మాత్రం బకాయిలుచెల్లించడం లేదన్నారు. చేసిన అప్పులకే హైదరాబాద్ నగరపాలక సంస్థ రోజుకు 2కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రం నగరపాలక సంస్థ నుంచి వసూలైన డబ్బులో ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని, కనీసం ఆస్తిపన్ను బకాయిలు కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలమై ఇద్దరు చిన్నారులు సైతం నాలాలోపడి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నాలాల అభివృద్ధి సైతం నిధులు లేక నిలిచిపోయాయని, పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదన్నారు. ఇప్పటికైనా సీఎం చొరవ తీసుకొని ప్రభుత్వ శాఖలు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed