ROR Act 2024: నిషేదిత జాబితాను నోటిఫై చేయాలి

by Praveen Kumar Siramdas |
ROR Act 2024: నిషేదిత జాబితాను నోటిఫై చేయాలి
X

నిషేదిత జాబితాను నోటిఫై చేయాలి

ధరణి రికార్డును గ్రామసభలో చదవాలి

మంత్రిని కోరిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు

దిశ, తెలంగాణ బ్యూరో:

కొత్త చట్టానికి ఆర్వోఆర్ 2020 ద్వారా తయారు చేసిన రికార్డునే బేస్ గా పరిగణనలోకి తీసుకుంటే గతంలో జరిగిన అవకతవకలకు, అక్రమాలకు చట్టభద్రత కల్పించినట్లవుతుందని తెలంగాణ విశ్రాంత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల సంక్షేమ సంఘం అభిప్రాయపడింది. 2018 ఎల్ఆర్ యూపీ రికార్డును ధరణి పోర్టల్ లోని రికార్డును గ్రామసభలో మాన్యువల్ గా, ఎలక్ట్రానిక్ రూపంలో చదివి వినిపించాలన్నారు. గురువారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని సంఘం నాయకులు కలిసి ఆర్వోఆర్ 2024 ముసాయిదాపై సూచనలు చేశారు. డ్రాఫ్ట్ లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకాల జారీ చేసే పద్ధతిని పునపరిశీలించాలన్నారు. ఓ వైపు తహశీల్దార్ రికార్డింగ్ అథారిటీగా వ్యవహరిస్తూ, మరోవైపు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా చేస్తున్నారన్నారు. అలాంటప్పుడు ఆక్షేపణలు కోరడం సమంజసం కాదన్నారు. దాంతో పాటు హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిషేదిత జాబితాను తయారు చేసి గ్రామసభలో నోటిఫై చేయాలని, వీలైతే సుమోటోగా డిలీట్ చేసే అధికారం కలెక్టర్లకు ఇవ్వాలన్నారు. రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఆవశ్యకత, రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పునర్వ్యవస్ధీకరరించాలని మంత్రిని కోరారు. డ్రాఫ్ట్ బిల్లుపై వచ్చిన సూచనలను ప్రస్తుతం రెవెన్యూ అధికారులతో ఎంతో అనుభవం కలిగిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.జగదీశ్వర్, ఇతర రెవెన్యూ అధికారులతో బిల్లును రూపొందించాలన్నారు. అలాగే డ్రాఫ్ట్ రూల్స్ ని కూడా పబ్లిక్ డొమెయిన్ లో పెట్టి సూచనలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత డ్రాఫ్ట్ బిల్లుపై ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల నుంచి సలహాలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఒక కొత్త ఒరవడిని సృష్టించిందన్నారు. మంత్రిని కలిసిన వారిలో రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు కే లక్ష్మయ్య, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్, బాలరాజ్, జ్ఞానేశ్వర్, రిటైర్డ్ తహశీల్దార్లు శ్రీనివాసరావు, ఎం.సూర్యనారాయణ, రాజారాం, రవీందర్ రెడ్డి, సంఘం సెక్రటరీ జనరల్ పి.జయప్రకాశ్ రావులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed