ప్రాంతీయ పార్టీలు సోషలిజం సాధనకు ఆలోచించాలి.. ప్రొఫెసర్ రమా మేల్కొటే పిలుపు

by Javid Pasha |
ప్రాంతీయ పార్టీలు సోషలిజం సాధనకు ఆలోచించాలి.. ప్రొఫెసర్ రమా మేల్కొటే పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించేందుకు ఉపయోగపడుతున్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు, సోషలిజం సాధనకు మాత్రం ఆలోచించలేక పోతున్నాయని ప్రముఖ సామాజిక వేత్త ప్రొఫెసర్ రమా మేల్కొటే అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) శ్రామిక మ‌హిళా ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో మగ్ధుంభవన్ లో “లౌకికవాదాన్ని పరిరక్షించండి- అధిక సంఖ్యాక బుజ్జగింపు దోరణిని ఓడించండి” అనే అంశంపైన సోమవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రమా మేల్కొటే మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులు, సమస్యల పరిష్కారానికి ప్రతి రోజు పాలకులను ప్రశ్నిస్తూనే ఉండాలని సూచించారు.

పోరాటాల ద్వారానే సోషలిజం సాధ్యమని, అసమానతలు లేని, సమానత్వంతో కూడిన సమాజం కోసం అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని, ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. గతంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కంటే కూడా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని మండిపడ్డారు. సీపీఐ నేత పశ్మపద్మ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శి కె. రజని, శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర కన్వీనర్ పి. ప్రేమ్ పావ‌ని, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఉస్తెల సృజన, నేదునూరి జ్యోతి, సదాలక్ష్మి, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story