- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, ఈటల, రేవంత్ ముగ్గురిదీ సేమ్ ప్రాబ్లమ్.. ఒకేచోట ఫోకస్ చేస్తే.. మరోచోట చిక్కులు..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మూడు పార్టీల కీలక నేతలు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారు ఏ సెగ్మెంట్‌పై ఫుల్ ఫోకస్ పెడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే, మరో సెగ్మెంట్ ఓటర్లకు కోపం వచ్చే ప్రమాదమున్నది. రెండు చోట్ల విజయం సాధించి చరిత్రలో నిలిచిపోవాలనే టార్గెట్‌తో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో బరిలోకి దిగారు. కాని కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో గజ్వేల్, హుజూరాబాద్ సెగ్మెంట్ల నుంచి బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీకి రెడీ అయ్యారు. కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. అయితే ఈ ముగ్గురు లీడర్లకు క్షేత్ర స్థాయిలో అనేక చిక్కులు ఎదురవుతున్నట్టు టాక్ ఉంది.
ప్రచారమే పెద్ద సమస్య
రెండు చోట్ల పోటీ చేస్తున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌కు ప్రచారం చేయడం పెద్ద సమస్యగా ఉంది. రోజుకు రెండు, మూడు సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న కేసీఆర్ ఇంతవరకు నేరుగా గజ్వేల్, కామారెడ్డి ఓటర్లను కలిసే ప్రయత్నం చేయలేదు. తొమ్మిదన్నరేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ తమ వద్దకు ఏనాడు రాలేదని గజ్వేల్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఈ మధ్య కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో గజ్వేల్ లీడర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన రేవంత్ కామారెడ్డిలో ప్రచారం చేసేందుకు ఎక్కువ టైమ్ దొరకదనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గజ్వేల్‌కు వచ్చి ఎంత మేరకు ప్రచారం చేసే చాన్స్ ఉంటుంది అనే చర్చ జరుగుతున్నది.
గజ్వేల్‌లో మెజార్టీ తగ్గే ప్రమాదం
ఈసారి గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ మెజార్టీ తగ్గే ప్రమాదముందని బీఆర్ఎస్ లీడర్లే ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో నెగెటివిటీ పెరడగం, సొంత పార్టీ లీడర్లు అసంతృప్తితో ఉండటం అందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అలాగే ఈటలకు గజ్వేల్ సెగ్మెంట్లోని పలు గ్రామాలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. నియోజవర్గంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ ఓటర్లు సమారు 30 వేల మంది ఉన్నారు. దీంతో కేసీఆర్ మెజార్టీ తగ్గే అవకాశముందని టాక్ మొదలైంది. 2018 ఎన్నికల్లో దాదాపు 58 వేల మెజార్టీతో కేసీఆర్ విజయం సాధించారు. ఇప్పుడు అంతకంటే తక్కువ మెజార్టీ వస్తే కేసీఆర్‌కు సొంత సెగ్మెంట్లోనే ఓట్లు తగ్గాయనే అపవాదు రానుంది.
కామారెడ్డిలో నెగెటివిటీ భయం
సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు సెగ్మెంట్లో నెగిటివ్ ఎక్కువగా ఉంది. దీంతో ఆయన పోటీ చేస్తే ఓడిపోతారని పలు రిపోర్టులో వెల్లడి కావడంతో కేసీఆర్ స్వయంగా కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే స్థానిక ప్రజలు బీఆర్ఎస్ పార్టీపైనే కోపంగా ఉన్నట్టు టాక్ ఉంది. ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అరాచాకలపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదనే అసహనంలో ప్రజలు ఉన్నట్టు తెలుస్తున్నది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ఎంత బుజ్జగించినా రైతుల్లో వ్యతిరేకత పోలేదనే భయంలో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.
ఈ విషయాన్ని గుర్తించిన కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కామారెడ్డి రైతులతో పలుసార్లు ప్రత్యేకంగా సమావేశయ్యారు. అయినా సానుకూలత రాలేదని తెలుస్తున్నది. మరోవైపు సెగ్మెంట్లోని రెండు, మూడు మండలాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు రేవంత్‌కు ఏకపక్షంగా పడితే కేసీఆర్‌కు సమస్యే అనే ప్రచారం జరుగుతున్నది.
హుజూరాబాద్, కొడంగల్‌పై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్
హుజూరాబాద్‌లో ఈటలను, కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ పలు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నది. ఈటలను ఓడించేందుకు స్వయంగా కేసీఆర్ ఆ సెగ్మంట్‌పై ఫోకస్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించి, తన తమ్ముడిని గెలిపించుకోవాలని మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్‌గా పనిచేస్తున్నారు. ఈ రెండు సెగ్మెంట్లలో బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మంట్ అప్పుడే మొదలైందని, అక్కడ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లకు పెద్ద ఎత్తున వనరులను అందించేందుకు పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఓడిస్తే హీరోలే..
సీఎం కేసీఆర్‌ను కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, గజ్వేల్‌లో ఈటల రాజేందర్ ఓడిస్తే ఆ ఇద్దరు లీడర్లు చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారనే కేసీఆర్ ధీమాకు బ్రేక్ పడనుంది. అదనంగా కేసీఆర్‌కు ప్రత్యామ్నాయ లీడర్లుగా ప్రజల్లో గుర్తింపు లభించనుంది. సొంత పార్టీల్లోనూ ప్రాముఖ్యత పెరగడంతో పాటు కీలక పదవులు దక్కే చాన్స్ ఉంటుంది.