భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైంది

by Sridhar Babu |
భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైంది
X

దిశ, మేడ్చల్ బ్యూరో : భారతదేశ రాజ్యాంగం ఎంతో పవిత్రమైందని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించి, రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు. మంగళవారం కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషి కారణంగానే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు.

అలాగే వ్యక్తిగత, ప్రజా జీవితాల్లో రాజ్యాంగంలోని అంశాలను విధిగా పాటించాలన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడు జీవించడానికి సమాన హక్కులు కల్పించిందన్నారు. రాజ్యాంగ సూత్రాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం భారత రాజ్యాంగం పట్ల విధేయతతో నడుచుకుంటామని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ రామ్మెహన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story