ఒకవైపు ఎగ్జామ్స్.. మరో వైపు అడ్మిషన్స్.. ప్రైవేట్ స్కూల్స్ దందా

by Sathputhe Rajesh |
ఒకవైపు ఎగ్జామ్స్.. మరో వైపు అడ్మిషన్స్.. ప్రైవేట్ స్కూల్స్ దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్​పరీక్షలు ఇంకా మొదలవ్వనే లేదు.. అంతలోనే పలు కార్పొరేట్​స్కూళ్లు, కాలేజీలు అడ్మిషన్స్​వేటలో పడ్డాయి. మే 6వ తేదీ నుంచి ఇంటర్​పరీక్షలు ప్రారంభమవుతుండగా, మే 23 నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. అంతకుముందు షెడ్యూల్​ప్రకారం కాకుండా ఎలా పడితే అలా అడ్డగోలుగా పలు ప్రైవేట్​యాజమాన్యాలు దందాను షురూ చేశాయి. గుట్టుచప్పుడు కాకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అడ్డగోలుగా ఫీజులు పెంచేసి తల్లిదండ్రులపై భారాన్ని మోపుతున్నాయి. తర్వాత తమ పిల్లలకు సీట్లు దొరుకుతాయో లేదోనని భయాందోళనతో ఉన్న పేరెంట్స్​కొందరు అడ్మిషన్స్​తీసుకునేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇంకొందరు ఆలస్యం చేస్తే ఫీజులు మరింత పెరుగతాయేమోనని భయంతో సీట్లు కన్ఫామ్​చేసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ప్రైవేట్, కార్పొరేట్​స్కూళ్లు ఇష్టం వచ్చిన సమయంలో అడ్మిషన్స్​తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా ఫీజుల నియంత్రణపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో లక్షలో ఫీజులు దండుకుంటున్నారు.

తెలంగాణలో పలు కార్పొరేట్​స్కూళ్లు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. కేవలం ఎల్​కేజీ, యూకేజీ కే కనీసం ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నాయి. 1వ తరగతి విద్యార్థులకైతే ఏకలంగా రూ.4 లక్షల వరకు కార్పొరేట్​యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్​కాకుండా మధ్య స్థాయిలో ఉన్న స్కూళ్లలో ఫస్ట్​క్లాస్​విద్యార్థులకు రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకు యాజమాన్యాలు రేట్లు ఫిక్స్​చేశాయి. లో ఫీ బడ్జెట్ స్కూళ్లలో రూ.30 వేల నుంచి మొదలు రూ.50 వేల వరకు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా ఫీజులు ఉన్న రాష్ట్రం తెలంగాణనే కావడం గమనార్హం. దేశంలోని అన్ని మెట్రో పాలిటన్​సిటీలతో పోల్చుకుంటే తెలంగాణలోని ఫీజుల దోపిడీ అధికంగా ఉందని చెబుతున్నారు. ఒక గ్లోబల్, ఇంటర్నేషనల్​స్కూళ్ల ఫీజుల వసూళ్లు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనేంతగా పరిస్థితి ఏర్పడింది. పటిష్టమైన ఫీజు రెగ్యులేటరీ కమిటీ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేరెంట్స్​అసోసియేషన్​చెబుతోంది.

తెలంగాణలోని పలు కార్పొరేట్ స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అది భరించలేక తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కొవిడ్ తో ఉపాధి కోల్పోయి సంక్షోభంలో ఉన్న పేరెంట్స్​ఎందరో ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుందన్న తరుణంలో ఇప్పటి నుంచే పలు స్కూళ్లు ముక్కు పిండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఫీజుల నియంత్రణకు గాను 2017 లో ప్రొఫెసర్​తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్​స్కూళ్ల యాజమాన్యాలు, పేరెంట్స్​కలిపి మొత్తం 11 మంది సభ్యులున్నారు. ఇప్పటి వరకు ఆ కమిటీ 7 సమావేశాలు నిర్వహించింది. 2017 డిసెంబర్ చివరి వారంలో ఒక నివేదిక సమర్పించింది. అయితే ఆ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన వ్యక్తులే కావడంతో ప్రతి ఏటా పది శాతం ఫీజులు పెంచుకోవాలని నిర్ణయించారు. దీనిపై పేరెంట్స్​అసోసియేషన్​వ్యతిరేకించడంతో మిన్నకుండిపోయారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు గాను కేబినెట్​సబ్​కమిటీని నియమించింది. అయితే వారు కూడా తిరుపతిరావు కమిటీ సలహాలు స్వీకరించినట్లు తెలుస్తోంది.

కేబినెట్​సబ్​కమిటీ తిరుపతి రావు కమిటీ రూపొందించిన 10 శాతం ఫీజు పెంపు అంశాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి పాఠశాలకు స్కూల్​లెవల్ ఫీ రెగ్యులేటరీ కమిటీ పెట్టాలని నిర్ణయించింది. పాఠశాల మేనేజర్​కమిటీకి చైర్మన్​గా ఉంటే, కరస్పాండెంట్ కమిటీకి కన్వీనర్ గా నియమించినట్లు తెలుస్తోంది. కమిటీ సభ్యులుగా ముగ్గురు టీచర్లు, ఐదుగురు పేరెంట్స్ ఉండాలని నిర్ణయించారు. అయితే ఆ పేరెంట్స్​కూడా ప్రైవేట్​యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేవారినే ఎన్నుకునే అవకాశాలుంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే పేరెంట్స్​పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా తమిళనాడు, రాజస్థాన్​రాష్ట్రాల్లో మాత్రమే ఫీజు నియంత్రణ కమిటీ పటిష్టంగా అమలవుతోందని, ఇతర చోట్ల ఆ పరిస్థితి లేదని పేరెంట్స్​అసోసియేషన్​సభ్యులు చెబుతున్నారు. అక్కడి కమిటీ ప్రతి మూడేళ్లకోసారి ఏ స్కూల్​కు ఎంత ఫీజు పెంచాలనేది నిర్ణయిస్తుంది. కానీ తెలంగాణలో అంత పటిష్టమైన యంత్రాంగం లేకపోవడమే ఈ ఇబ్బందుకు ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు.

ఫీజులు పెంచొద్దు

ప్రైవేట్​స్కూళ్లలో ఫీజుల దోపడీని నియంత్రించాలి. ఫీజు నియంత్రణ చర్యలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయాలి. తెలంగాణలోనూ తమిళనాడు, రాజస్థాన్​విధివిధానాలను అమలు చేయాలి. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ మంత్రికి నివేదిక అందించాం. అయినా వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి కొన్ని ప్రైవేట్, కార్పొరేట్​స్కూళ్లు అడ్డగోలుగా ఫీజులు పెంచి వసూలు చేస్తున్నాయి. కొవిడ్​కారణంగా ఇబ్బందులు పడినట్లు చెప్పి కొన్ని స్కూళ్లు 20 శాతం నుంచి ఏకంగా 30 శాతం వరకు పేరెంట్స నుంచి దండుకుంటున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలి-నాగటి నారాయణ, తెలంగాణ పేరెంట్స్​అసోసియేషన్ అధ్యక్షుడు

Advertisement

Next Story