K.N RAJASHEKAR: మన్ కీ బాత్ లో తెలంగాణ వ్యక్తికి ప్రధాని ప్రశంసలు.. ఎవరీ రాజశేఖర్?

by Prasad Jukanti |   ( Updated:2024-09-29 07:57:21.0  )
K.N RAJASHEKAR: మన్ కీ బాత్ లో తెలంగాణ వ్యక్తికి ప్రధాని ప్రశంసలు.. ఎవరీ రాజశేఖర్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏక్ పేడ్ మా కే నామ్ (తల్లి పేరిట మొక్క) కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని ఇది నిజంగా స్ఫూర్తిదాయకమైన మొత్తం సమాజానికి అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు నిర్దేశించిన లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయని కొనియాడారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్ మొక్కలు నాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

ఎవరీ రాజశేఖర్..

భద్రాద్రి కొత్తగూటెం జిల్లాకు చెందిన కొత్తూరు నుర్వి రాజశేఖర్ సింగరేణి కాలరీస్ లోని సెంట్రల్ వర్క్ షాప్ లో ఫిట్టర్ గా పని చేస్తున్నాడు. ప్రకృతిపై మమకారంతో 2016 నుంచి స్వచ్ఛందంగా ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. 1 జూలై 2020 నుంచి ప్రతి రోజు కనీసం ఒక్క మొక్కనైనా క్రమం తప్పకుండా నాటాలనే సంకల్పంతో ‘ప్రకృతి హరిత దీక్ష’ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ప్రముఖులు, తన స్నేహితులు, బంధువుల పుట్టిన రోజు, పెళ్లి వేడుకల సందర్భంగా ఓ మొక్కను నాటుతున్నాడు. ఇలా ప్రతిరోజు మొక్కలు నాటుతు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో ఇతర బహుమతులకు బదులు మొక్కతో పాటు పక్షుల గూడును బహుమతిగా ఇస్తూ అందరిలో ఆలోచన కలిగిస్తున్నాడు. కోటి విత్తనాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా విత్తనాలను పంపిణీ చేశాడు. ఇందులో ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేశాడు. తన బైక్ లో ఎప్పుడు మొక్కలను తీసుకెళ్తు ఇతరులకు పంచి పెడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ప్రకృతికోసం ఇతడు చేస్తున్న సేవకు గాను ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. పలు ఎన్జీవోలు సైతం రాజశేఖర్ చేస్తున్న సేవను గర్తించి సన్మానాలు చేశాయి. తాజాగా ఆయన సేవలను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తించారు.

Advertisement

Next Story

Most Viewed