- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pravalika Case : ప్రవళిక సూసైడ్‌కు కారణమేంటి? బాధ్యులెవరు?
దిశ, తెలంగాణ బ్యూరో : ఎన్నికల టైంలో ప్రవళిక సూసైడ్ వ్యవహారం బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నది. దీని నుంచి బయట పడేందుకు ఆ పార్టీ నానా తంటాలు పడుతున్న. సూసైడ్ ఇష్యూ కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రవళిక ఆత్మహత్య నిరుద్యోగులందరినీ ఏకం చేయడంతో ఇది రాజకీయంగా తమకు దెబ్బ తగులుతుందని బీఆర్ఎస్ ఆందోళనలో పడ్డది. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా ధృవీకరించారు. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తి దీనికి కారణమని ఆయన పేరును వెల్లడించారు. స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోదామనుకున్న శివరామ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకునే ప్రయత్నాలకు నాంపల్లి కోర్టు బ్రేక్ వేసింది. న్యాయ స్థానం సొంత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
అధికార పార్టీకి చిక్కులు
పోలీసులకు ఊహించని ఝలక్ తగలడం అధికార పార్టీకి లాజికల్‌గా చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రవళిక సూసైడ్‌కు శివరామ్ రాథోడ్ కారణమని పేర్కొన్న పోలీసులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిమాండ్ రిపోర్టులో శివరామ్‌పై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. పోలీసుల అరెస్టును తప్పుపట్టింది. ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న రిక్వెస్టును రిజెక్ట్ చేసింది. జ్యుడీషియల్ రిమాండ్ కూడా అవసరం లేదన్న అభిప్రాయానికి వచ్చింది. సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రవళిక సూసైడ్ ఇష్యూను పోలీసుల ద్వారా డైవర్ట్ చేయించాలనుకున్న బీఆర్ఎస్ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. విధిలేని పరిస్థితుల్లో ప్రవళిక తల్లిదండ్రుల ద్వారానే ఇష్యూను డైల్యూట్ చేసే ప్రాసెస్ మొదలైంది.
నిరుద్యోగులకు ఊహించని ట్విస్ట్
ప్రవళిక మృతికి ప్రేమించిన వ్యక్తి శివరామ్ రాథోడ్ కారణమని తల్లి, సోదరుడు వీడియో స్టేట్‌మెంట్ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇది ఊహించని ట్విస్ట్ గానే కనిపించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వారిని బీఆర్ఎస్ లీడర్లు ప్రలోభ పెట్టారన్న విమర్శలొచ్చాయి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్‌ను ట్రోల్ చేస్తూ పోస్టులు దర్శనమిస్తున్న టైంలోనే మృతురాలి తల్లి, సోదరుడిని కేటీఆర్ పిలిపించుకుని మాట్లాడారు. అర్హతకు తగిన ప్రభుత్వ ఉద్యోగమిస్తామని ప్రవళిక సోదరుడికి కేటీఆర్ హామీనిచ్చారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ప్రవళిక మృతికి కారణమైన శివరామ్ రాథోడ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకొని శిక్షించేలా చొరవ తీసుకుంటామని స్పష్టం చేశారు.
కేటీఆర్‌కు డ్యామేజ్
ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే పోలీసుల వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మంత్రి కేటీఆర్ ఓపెన్ కామెంట్లు చేశారు. గ్రూప్ పరీక్షలకు ఆమె దరఖాస్తే చేసుకోలేదన్నారు. ఈ కామెంట్లు చేసిన గంటల వ్యవధిలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల కోసం ఆమె దరఖాస్తు చేసుకున్న వివరాలను, హాల్ టికెట్లను నిరుద్యోగులు బహిర్గతం చేశారు. పరీక్షలు వాయిదా పడడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నదని సూసైడ్ లెటర్‌నూ సోషల్ మీడియాలో డిస్‌ప్లే చేసి కేటీఆర్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగానే ఇష్యూను మంత్రి కేటీఆర్ డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా ఫైర్
ప్రవళిక సూసైడ్ వ్యవహారం నిరుద్యోగుల ఓటు బ్యాంకు పై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ తెరవెనక డ్రామా నడిపించిందని విద్యార్థి సంఘాలు, నిరుద్యోగుల నుంచి ఆరోపణలు వచ్చాయి. డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా మరింత నెగెటివ్‌గా మారింది. పోలీసుల అభియోగాలను న్యాయస్థానమే తప్పు పట్టడంతో నిరుద్యోగుల అభిప్రాయాలకు బలం చేకూరినట్లయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు పరోక్షంగా ప్రభుత్వానికి, అధికార పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే ఆలోచనతోనే ప్రవళిక క్యారెక్టర్‌నే ప్రశ్నార్థకం చేశారంటూ మంత్రి కేటీఆర్‌ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. కేటీఆర్ ప్రయత్నాలు పార్టీకి ఉపయోగపడక పోగా మరింత డ్యామేజ్‌కు కారణమైంది.
ఏ రకంగా ప్రభావం చూపుతుందో..
రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును నిరుద్యోగులు, విద్యార్థులు, ఫస్ట్ టైమ్ ఓటర్లు, యూత్ ఏ రకంగా ప్రభావితం చేస్తారు?.. ప్రవళిక ఇష్యూ ఏం ముప్పు తెస్తుంది?.. సోదరుడు, తల్లితో ఇప్పించిన వీడియో స్టేట్‌మెంట్లు రివర్స్ కొడతాయా?.. నాంపల్లి కోర్టు చేసిన కామెంట్లు బీఆర్ఎస్‌కు చెంపపెట్టులా పనిచేస్తాయా?.. ఈ అంశాలే ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. ప్రవళిక ఇష్యూ సైలెంట్ అయిపోయినా అది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.