CM రేవంతే రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీయడానికి కారణం: వంటేరు ప్రతాప్ రెడ్డి

by Satheesh |
CM రేవంతే రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీయడానికి కారణం: వంటేరు ప్రతాప్ రెడ్డి
X

దిశ,తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుందని, ఈ ఏడు నెలలుగా అప్పులు చేయడం తప్ప కొత్త పథకం లేదని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ చుట్టూ తిరగడం, పదవుల కోసం పకులాడడం, పదవుల కోసం పైరవీలు చేయడం తప్ప ఇంకోటి లేదని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం పై నిందలు వేయడం తప్ప పరిపాలన పై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు.

గత ప్రభుత్వం పెట్టిన పథకాలు అమలు చేయడంలేదని, కానీ 38 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. వాటితో ఒక్క కొత్త పథకం అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదన్నారు. వ్యవసాయ రంగానికి నిరంతరం కరెంట్ పోతుందని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం 24 గంటలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 8 గంటలపాటు కరెంట్ కోతలు పెడుతుందన్నారు. నేతల ఆదాయం పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం మాత్రం పెంచడం లేదని దుయ్యబట్టారు.

అవినీతిలో ఎమ్మెల్యేలు, మంత్రులు కూరుకుపోయారని, పైగా అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రతి నెల మార్చుతున్నారని ఆరోపించారు. నిర్దిష్టమైన ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదని, కనీసం పాలనపై కూడా అవగాహన లేదన్నారు. అధికారులపై అవగాహన లేదు ఈ ప్రభుత్వం పెద్దలకు అని విమర్శించారు. గత ప్రభుత్వంలో అప్పులు తెచ్చి సాగు నీటి ప్రాజెక్టులను నిర్మించామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ మల్లన్న సాగర్‌లో నీళ్లు లేవు, కొండపోచమ్మ సాగర్‌లో నీరు అడుగంటుతున్న పరిస్థితి నెలకొందని, రంగనాయకసాగర్ ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా అడవుల విస్తీర్ణం పెంచితే, ఇప్పుడు మళ్లీ అడవులు అంతరించి పోతున్నాయన్నారు.

గత ప్రభుత్వంపై నిందలు వేయడం తప్ప ఇంకోటింలేదన్నారు. రాష్ట్రం దివాళా అంచులో ఉందని, ప్రతి నెల ఆదాయం 13 వేల కోట్ల ఆదాయం రావాలని, కానీ గత నెల 10 వేల కోట్లు మాత్రమే వచ్చిందంటే దివాలాలో ఉన్నట్లా..? లేనట్లా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసిందని దానికి కారణం సీఎం రేవంత్ రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు. ఆంధ్రలో రియల్ ఎస్టేట్ పుంజుకుందని, అక్కడ వ్యాపారం కూడా బాగా పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంను కూల్చడానికి ఎవరు సిద్ధంగా లేరని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed