Gram Panchayat : స్పెషలాఫీసర్లు మీ జాడ ఎక్కడ ?

by Sumithra |
Gram Panchayat : స్పెషలాఫీసర్లు మీ జాడ ఎక్కడ ?
X

దిశ, బిజినేపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాలలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా గ్రామానికి స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అయితే గ్రామాల్లో అభివృద్ధి ముందుకు సాగాలని ఉద్దేశంతో నియమిస్తే వారు మాత్రం గ్రామాలలో పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టకపోవడంతో బిజినేపల్లి మండలం ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. తమ గ్రామాలకు నియమించిన ఆ స్పెషలధికారి పేరు, ఆఫీసర్ ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచకపోవడంతో ఆ గ్రామ ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలోని ప్రజలు తమ గ్రామాలకు ఎవరిని స్పెషల్ ఆఫీసర్గా నియమించారో తెలియక తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో అయోమయంలో ఉన్నామన్నారు. స్పెషల్ ఆఫీసర్లకు కేటాయించిన పంచాయతీలకు ఇప్పటివరకు సరిగ్గా హాజరు కాకపోవడం, వారి పాలన పై దృష్టి పెట్టకపోవడంతో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొన్ని నెలల వరకు సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం లేకపోవడం,స్పెషల్ ఆఫీసర్లు గ్రామ అభివృద్దికి దృష్టిసారించకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకొని మండలంలోని ఆయా గ్రామాలకు కేటాయించిన అధికారులు పంచాయతీలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకొని, గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవాలన్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాలకు కేటాయించిన స్పెషలాఫీసర్లు గ్రామాల వైపు కన్నెత్తి చూడకపోవడంతో గ్రామాలు చెత్తాచెదారంతో పాటు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి గ్రామాలు అపరిశుభ్రంగా తయారయ్యాయన్నారు.

బిజినేపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ, అంబేద్కర్ చౌరస్తా నుంచి మంగనూరు వైపు వెళ్లే డ్రైనేజీ, పోలేపల్లి గ్రామంలో పోలేపల్లి నుంచి తండా వైపు వెళ్ళు రోడ్డు డ్రైనేజీ, గుడ్ల నర్వ గ్రామంలో ఎస్సీ కాలనీలోని రెండు వైపులా ఉన్న పెద్ద డ్రైనేజీలు, పాలెం, వడ్డేమాన్, కారుకొండ ఆయా కాలనీలలో అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో వీధిలైట్లు లేక గ్రామాలు సమస్యల వలయంగా తయారయ్యాయని వాపోతున్నారు. ఇక పంచాయతీ కార్యదర్శులు 10 గంటలకు వచ్చి తిరిగి 12 గంటలకు వెళ్లడంతో గ్రామాలలోని ప్రజలు తమ సమస్యలు తెలపాలన్న మళ్లీ మండల కేంద్రానికి వెళ్లక తప్పడం లేదని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న సమస్యల పై దృష్టి పెట్టి స్పెషలాఫీసర్ తమకు కేటాయించిన గ్రామాల్లో వారానికోసారి పర్యవేక్షించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed