ఎమ్మెల్యే సాబ్ మాకు న్యాయం చేయండి ?

by Sumithra |
ఎమ్మెల్యే సాబ్ మాకు న్యాయం చేయండి ?
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టణ అభివృద్ధిలో భాగంగా మెయిన్ రోడ్డును వెడల్పు చేసే క్రమంలో రోడ్డుకు ఇరువైపుల చిన్న చిన్న షెడ్లను నిర్మించుకొని జీవనోపాధి పొందుతున్న చిరు వ్యాపారుల షెడ్లను తొలగించడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఈ విషయాన్ని బాధితులు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే తమ గోడును వినిపించగా అతను స్పందించి పట్టణంలోని సబ్ స్టేషన్ ప్రాంతంలో గల విద్యుత్ శాఖకు చెందిన భూమిలో చిరు వ్యాపారులకు షెడ్లను నిర్మించి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇదే సందర్భంలో విద్యుత్ శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు.

ఒక సందర్భంలో మున్సిపల్ శాఖ అధికారులు, స్థానిక అధికార పార్టీ నాయకులు భూమిని సర్వే చేస్తుండగా విద్యుత్ శాఖ అధికారులు అడ్డుపడి గందరగోళం సృష్టించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఇదే అదనుగా భావించిన ఇంటి యజమానులు అధికంగా డిపాజిట్లు, కిరాయిలు వసూలు చేస్తు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని వారు లబోదిబోమంటున్నారు. మార్కెట్లో పోటీ పెరిగి తమ వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నప్పటికీ అధిక కిరాయిలు చెల్లించే స్తోమత తమకు లేదని వాపోతున్నారు. గతంలో గ్రామపంచాయతీ పరిధిలో గల షెడ్లకు తాము డిపాజిట్లు చేశామని అవి కూడా తిరిగి అధికారులు చెల్లించడం లేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తమ బాధను అర్థం చేసుకొని తమకు షెడ్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed