Gadwal Collector : రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు

by Aamani |
Gadwal Collector :  రైతులు నూతన సాంకేతిక  పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా కలెక్టర్(Collector) బీఎం సంతోష్ అన్నారు. శనివారం గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (గంజి)లో ఏర్పాటు చేసిన గద్వాల రైతు సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ( MLA Bandla Krishna Mohan Reddy)ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా వారు పూజా కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఉద్యానవనశాఖ, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ స్టాల్స్‌లో విత్తనాలు, వ్యవసాయ, ఉద్యానవన పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులు, ఎరువులు, పురుగుమందులు, వినూత్న పరికరాలు వంటి వ్యవసాయ, ఉద్యానవనానికి సంబంధించిన పలు వస్తువులు ప్రదర్శించబడ్డాయి.

ప్రతీ స్టాల్‌ను పరిశీలించి అందులో ప్రదర్శించిన సాంకేతికత, ఆధునిక పద్ధతులపై వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... మన జిల్లాలో ప్రజలు సుమారు 80 శాతం మంది జీవనాధారం వ్యవసాయం (Agriculture) మీద ఆధారపడి ఉన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఆధునిక పద్ధతుల మీద అవగాహన కల్పించేందుకు, పల్లె సృజన, గద్వాల ఎమ్మెల్యే తో కలిసి ఈ రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సదస్సులో మొత్తం 40 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ఇందులో విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఎరువులు, నానో టెక్నాలజీ ఆధారిత యూరియా,పెస్టిసైడ్స్ వంటి అంశాలను ప్రదర్శించారు. మన జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటలు సాగు అవుతున్నాయని అన్నారు.

హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇతర డిపార్ట్‌మెంట్ల ద్వారా రైతులకు అధిక లాభాలను కలిగించే పంటల గురించి అవగాహన కల్పించడం మే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఒక ఎకరా వరి పంట సాగు చేయడానికి సుమారు 12 లక్షల లీటర్ల నీరు అవసరం కాగా, కందిపప్పు, హార్టికల్చర్ వంటి ఇతర డ్రై పంటలకు కేవలం 5-6 లక్షల లీటర్ల నీరుతోనే పంటను సాగు చేయవచని అన్నారు. ఇది నీటి వనరులను సంరక్షించడంలో మాత్రమే కాకుండా, రైతులకు ఖర్చు తగ్గించడంలో కూడా సహాయపడుతుందని అన్నారు. తక్కువ నీటితో మంచి దిగుబడులు అందించే పంటలు కందిపప్పు, పామ్ ఆయిల్, డ్రాగన్ ఫ్రూట్, బత్తాయి మొదలైనవి తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డిఓ రాం చందర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ భాష, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed