Minister Kishan Reddy : వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి

by Kalyani |
Minister Kishan Reddy : వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో  హైదరాబాద్ ఒకటి
X

దిశ, ముషీరాబాద్: ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి (Minister Kishan Reddy) అన్నారు. పారిశ్రామిక, ఐటీ, ఫార్మా, డిఫెన్స్, హెల్త్ సెక్టార్, విద్యారంగాల్లో హైదరాబాద్ వేగవంతంగా ముందుకెళ్తుందని చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడిక్ మెట్, ముషీరాబాద్ డివిజన్ లలో రూ. 1 కోటి 35 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ (MLA Mutha Gopal) , కార్పొరేటర్ సుప్రియ గౌడ్ లతో కలిసి శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… చిన్నపాటి వర్షం పడితే డ్రైనేజి వాటర్ ఇళ్ళలోకి రావడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

హైదరాబాద్ ( Hyderabad ) నగరంలో డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తం గా ఉందని తెలిపారు. అనేక బస్తీలు, హైదరాబాద్ చుట్టుపక్కల కాలనీలలో ఓపెన్ డ్రైనేజి ఉంది. ఇంతవరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయలేదన్నారు. గత కొన్ని రోజులుగా కాంట్రాక్టర్లకు బిల్లులు లేక, హైదరాబాద్ సివిక్ ప్రాబ్లమ్స్ లో ఉందని, పని చేసే కార్మికులకు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంజూరైన పనులకు టెండర్లను పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో డ్రైనేజి వ్యవస్థ స్తంభించిపోయే అవకాశం ఉందన్నారు. లక్షా యాభై వేల కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy ) పదేపదే చెప్తున్నారన్నారు.

హైదరాబాద్ కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమే కానీ, పేదవాళ్ల ఇండ్లను తొలగించకూడదన్నారు. బస్తీలల్లో డ్రైనేజి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని చెప్పారు. హైదరాబాద్ నగరం విషయంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసి కావాల్సిన నిధులు మంజూరు చేసి నగరాన్ని రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. అడిక్ మెట్, ముషీరాబాద్ డివిజన్ లో పరిధిలోని లలిత నగర్ గ్రేవీయార్డ్, పద్మశాలి సంఘం కమ్యూనిటీ హల్ రెండో ఫ్లోర్ పనులను, బాదం చెట్టు గల్లీ లో సీసీ రోడ్డు పనులు, మున్సిపల్ వార్డ్ ఆఫీస్, వాలీ బాల్ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్, స్టేజ్ సిట్టింగ్ గ్యాలరీలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, బిజెపి, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed