- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లు చెదిరేలా 100 ఎకరాల్లో ఏర్పాట్లు.. అట్టహాసంగా పొంగులేటి కూతురు రిసెప్షన్
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పొంగులేటి ఇంట వివాహ మహోత్సవం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఎవరినోట విన్నా శ్రీనివాస్ రెడ్డి ముద్దుల కూతురు సప్నిరెడ్డి వివాహ మహోత్సవం, రిసిప్షన్ గురించే చర్చించుకుంటున్నారు. ఈ నెల 12న కల్యాణ ఘట్టం ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరగగా, 17వ తేదీ ఖమ్మంలో మహా రిసిప్షన్ వేడుక జరుగనుంది. ఈ కార్యక్రమం కోసం ఖమ్మంలో ఇంత వరకు లేని విధంగా ఏర్పాటు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన బిడ్డ పెళ్లి వేడుకకు శ్రీనివాసరెడ్డి కనీసం మూడు లక్షల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తన బిడ్డ పెళ్లి చరిత్రలో నిలిచిపోయేలా చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఎవరినోట విన్నా ఇదే మాట. 17న జరుగనున్న మహా రిసెప్షన్‌కు ఖమ్మం సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్ దగ్గర సుమారు వంద ఎకరాల్లో ఏర్పాట్లు ఆగమేఘాల మీద పూర్తవుతున్నాయి. రాజస్థాన్ ప్యాలెస్‌ను పోలిన ప్రత్యేక సెట్టింగ్ నిర్మాణం చేయడంలో టాలీవుడ్ సినీ సెట్టింగ్ ప్రముఖులు దగ్గరుండి పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా ఖర్చుచేసి శుభలేఖలు, అంతే స్థాయిలో గోడగడియారాలు ప్రతీ ఇంటికీ అందేలా పొంగులేటి సైన్యం విశేషంగా కృషిచేసింది.
రాజస్థాన్ ప్యాలెస్‌ను తలపించేలా సెట్టింగ్
జిల్లాలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది. పొంగులేటి ఇంట పెళ్లి వేడుక అంటే రేంజ్ ఉండాలి కదా మరి.. అందుకే రిసెప్షన్ సెట్టింగులు బాహుబలి రేంజ్‌లో చేస్తున్నారు. గతంలో మరెన్నడూ చూడని రీతిలో సినిమా సెట్టింగులతో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులను రప్పించి భారీ వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. రాజస్థాన్ ప్యాలెస్‌ను తలపించేలా సినీ సెట్టింగ్లతో ప్రాంగణం ముస్తాబువుతోంది. నెలరోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంటా శ్రీనివాస్ రెడ్డి ఇంట జరుగుతున్న పెండ్లి తంతు గురించిన చర్చే కావడం విశేషం. రిసెప్షన్ కోసం వచ్చే వారి వాహనాలను పార్క్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాలనీ, ఖమ్మం వైరా హైవే సమీపంలో ప్రత్యేకంగా పార్కింగ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30వేల కార్లు వస్తాయన్న అంచనాతో ఆయా వాహనాలకు ఎక్కడా ఇబ్బంది కలుగకుండా పార్కింగ్ కు ప్రత్యేక స్థలం కేటాయించారు.
100 ఎకరాల్లో ఏర్పాట్లు..
పొంగులేటి కూతురు సప్నిరెడ్డి వివాహ రిసెప్షన్‌కు ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఒక్కరికీ.. కుటుంబ సమేతంగా రావాల్సిందిగా శుభ ఆహ్వానం పలుగుతున్నానని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి మాధురి, పొంగులేటి సోదరుడు ప్రసాదరెడ్డి, శ్రీలక్ష్మి దంపతులు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఈ మహా రిసిప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. 17న ఖమ్మంలోని తన సొంత కన్వెన్షన్ హాల్ ఎస్ఆర్ గార్డెన్ సమీపంలోని ఎన్ఎస్పీ కెనాల్ ప్రాంతంలో సుమారు వందెకరాల్లో మహా రిసెప్షను చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ వేడుకకు మూడు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్రూఫ్ టెంట్లు, ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేస్తున్నారు. వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా ఈ కెనాల్ పై అత్యవసరంగా బ్రిడ్జిని నిర్మాణం చేశారు. ఐరన్తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే నిర్మాణం చేయడం విశేషం. ప్రస్తుతం వైఎస్సార్ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జితోపాటు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇన్ అవుట్ ప్రాతిపదికన మరో బ్రిడ్జి నిర్మాణం చేశారు.
ప్రముఖుల రాక..
ఈ నెల 12న ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో వివాహ వేడుక జరుగగా.. అక్కడి కల్యాణ వేడుకను తిలకించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోని సుమారు 500 మంది అత్యంత ప్రముఖులకు ఆహ్వానం అందింది. కాగా, సప్నిరెడ్డి, అర్జున్ రెడ్డి దంపతులను ఆశీర్వదించేందుకు గాను మహా రిసిప్షన్ వేడుకకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు అనేక మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు, ఉన్నతాధికారులు, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలు వేలాదిగా తరలిరానున్నారు. ఒకే సారి సుమారు 40వేల మంది భోజనం చేసేలా రెండు వేల అడుగుల పొడవునా ఏర్పాట్లు చేశారు. వీవీఐపీలకు భోజనం వడ్డించేందుకు గాను ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతానికి చెందిన వారిని ప్రత్యేకంగా రప్పించారు.. ఈ మహా ఘట్టానికి లక్షలాదిగా తరలిరానున్న శీనన్న అభిమానులకు కరీంనగర్ ఫేమస్ వంటలమ్మ యాదమ్మ వంటకాలు రుచి చూడనున్నారు. రుచికరమైన వెజ్, నాన్ వెజ్, స్పెషల్ బిర్యానీతోపాటు అనేక రకాల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి.
చరిత్రలో నిలిచిపోయేలా: తుంబూరు దయాకర్ రెడ్డి, కార్యాలయ ఇన్చార్జీ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట వివాహం అంటేనే ఒక స్పెషల్. గతంలో కుమారుని వివాహం చాలా గ్రాండ్ గా నిర్వహించారు. కూతురు వివాహం కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఈ వేడుకకు వస్తారని అంచనా వేశాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక సైన్యమే పనిచేస్తుంది. పొంగులేటి కూతురు వివాహం చరిత్రలో నిలిచేలా గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రజలందరూ తమ ఇంటి బిడ్డ ఆహ్వానంగా భావించి హాజరు కావాలి. శీనన్న బిడ్డను దీవించాలి.