Ponguleti Srinivas Reddy: మైక్ దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడిస్తారా?.. పొంగులేటి సీరియస్

by Prasad Jukanti |   ( Updated:2024-09-03 14:52:26.0  )
Ponguleti Srinivas Reddy: మైక్ దొరికింది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడిస్తారా?.. పొంగులేటి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ అప్రమత్తత, ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే రాష్ట్రంలో వచ్చిన వరదల్లో తక్కువ ప్రాణనష్టం సంభవించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నదని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి సమీక్షలో మాట్లాడిన ఆయన.. ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, ఆ పార్టీ మాజీ మంత్రుల బ్యాచ్ అంతా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా వరదలు వచ్చి 3 రోజులు అవుతుంటే ఈరోజు అక్కడక్కడా బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తూ రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలవి రాజకీయ విమర్శలే తప్ప ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కాపాడటం కోసం తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం లేదన్నారు. ఇటువంటి సందర్భం గతంలో ఎప్పుడూ రాలేదన్నారు.

పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణా జిల్లాలో ఎంత నష్టం జరిగింది ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంత నష్టం జరిగిందో ప్రధాన ప్రతిపక్షం వారి తొత్తులకు రెండు కళ్లు ఉంటే చూడాలన్నారు.ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక్కడ ప్రాణ నష్టం సంభవించిందన్నారు. ఏనాడైనా గత సీఎం కేసీఆర్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రత్యక్షంగా వచ్చి వారిని పరామర్శించారా అని ప్రశ్నించారు. కేవలం వారి స్వలాభం కోసం తప్ప ప్రజల కష్టాల గురించి మాట్లాడం లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే మంచి సూచనలు చేస్తే భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా వాటిని స్వీకరిస్తుందన్నారు. ఈ విషయం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారని గుర్తు చేశారు. సూచనలు ఇవ్వకుండా మైక్ దొరికితే యుద్ధం ప్రకటించినట్లుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మరికొందరితో నోటితో చెప్పలేని మాటలు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరం, బాధాకరం అన్నారు. అధికారంలో ఉండగా దోచుకుని దాచుకున్న వాటిలో రూ. 1000 లేదా 2000 కోట్లో సీఎం సహాయనిధికి ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed