ఆ జిల్లాలో పొలిటికల్ తీన్మార్.. అన్ని పార్టీల స్పెషల్ ఫోకస్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:54:24.0  )
ఆ జిల్లాలో పొలిటికల్ తీన్మార్.. అన్ని పార్టీల స్పెషల్ ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వారం రోజుల గ్యాప్ లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ అగ్రనేతల చేత ఉమ్మడి ఖమ్మంలో సభలకు ప్లాన్ చేయడం రాజకీయాన్ని మరింత ఆసక్తిగా మారుస్తోంది.

ఈ క్రమంలో పార్టీకి వరుసగా షాకులు తగులుతున్న ఉమ్మడి ఖమ్మంలో ఈసారి తమ సత్తా చాటాలని గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సభకు వేదికను ఖమ్మం జిల్లానే ఎంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలతో పాటు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్టు పార్టీ నేత డి.రాజా వంటి వారిని ఆహ్వానించారు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి గురితప్పకుండా గులాబీ జెండా పై చేయి సాధించడమే టార్గెంట్ గా కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీని పరుగులు పెట్టిస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికల దండయాత్ర ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది. 2018 ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడంతో హస్తం పార్టీ కాస్త డీలా పడిపోయింది.

దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ శ్రేణులను పునరుత్తేజం చేసేలా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ గు గురైన పొంగులేటి, జూపల్లిలు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఖమ్మం వేదికగా ఈ నెల 20 లేదా 25న లక్ష మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అదే వేదికగా పార్టీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ సభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ఎవరో ఒకరిని ఆహ్వానించడం ద్వారా ఉమ్మడి ఖమ్మంలో హస్తం పార్టీ తన సత్తాను చాటుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

ఇక కేసీఆర్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా పని చేస్తున్న బీజేపీ సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాను తన ప్రయార్టీగా ఎంచుకోవడం ఆసక్తిగా మారింది. ఇక్కడ ఆశించిన స్థాయిలో పార్టీకి బలం లేదనే విశ్లేషణలు ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ నెల 15న జరగనున్న సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు అవుతారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే షర్మిల సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరుపై దృష్టి సారించారు. కమ్యునిస్టులు సైతం తమకు పట్టున్న ఖమ్మంలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఉమ్మడి ఖమ్మంపై ఫోకస్ పెట్టడంతో రాజకీయం మరింత ఆసక్తిగా మారుతోంది.

Advertisement

Next Story