ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు!

by GSrikanth |   ( Updated:2023-01-27 02:10:23.0  )
ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. కులాలవారీ ఓటు బ్యాంకుపై లెక్కలు వేసుకున్నాయి. ఏ కులం ఎటువైపు మొగ్గు చూపుతున్నదో అంచనాకు వచ్చాయి. వారిని ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఒకదాన్ని మించి మరో పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఈసారి ఏపీలో కాపు, తెలంగాణలో మున్నూరుకాపు ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ సామాజికవర్గానికి పాలిటిక్స్‌లో ప్రాధాన్యం పెరిగింది. ఎన్నికల్లో ఈ కమ్యూనిటీ ఓటు బ్యాంకు నిర్ణయాత్మకంగా మారింది. నిర్దిష్టంగా ఒక నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా ఆ సామాజికవర్గం అవతరించిందని పార్టీలు గుర్తించాయి. ఏపీలో సుమారు 25%, తెలంగాణలో దాదాపు 12% మేర ఈ కమ్యూనిటీ ఓటు బ్యాంకు ఉన్నట్లు పార్టీల అంచనా. గతంలో కాంగ్రెస్‌ పార్టీతో ఈ కమ్యూనిటీ లీడర్లు కొనసాగారు.

కానీ వేళ్లమీద లెక్కపెట్టదగిన స్థాయిలోనే పార్టీలో, ప్రభుత్వంలో వారికి పదవులు వచ్చాయే తప్ప కమ్యూనిటీ ప్రజలకు ఒరిగిందేమీ లేదనే అభిప్రాయం బహిరంగంగానే వ్యక్తమవుతున్నది. ఏ పార్టీతో వెళ్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే చర్చ ఆ సామాజికవర్గానికి చెందిన నేతల్లో ప్రస్తుతం మొదలైంది. ఇటీవల హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాలకు చెందిన కాపు లీడర్లు సమావేశమై లోతుగా చర్చలు జరిపారు. ఒక్కో పార్టీ బలం, బలహీనతలు, ఇంతకాలం దక్కని గుర్తింపు, లభించని ప్రాధాన్యం తదితరాలపై చర్చించారు. ఇకపైన ఏ పార్టీతో ఎక్కువ ప్రయోజనాలు, అవకాశాలు లభిస్తాయనేదానిపై విశ్లేషణలు చేశారు. ఏపీ, తెలంగాణ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు.. రానున్న ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపాలి? కమ్యూనిటీ ప్రజలకు ఏం పిలుపు ఇవ్వాలి? అనే అంశాలపైనా డిస్కస్ చేశారు.

బీఆర్ఎస్ వినూత్న వ్యూహం

తెలంగాణలో మున్నూరుకాపు కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యం ఇచ్చామని నమ్ముతున్న బీఆర్ఎస్.. ఇప్పుడు ఏపీలోనూ విస్తరించాలని అనుకుంటున్నందున ఆ కమ్యూనిటీపైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి, ఎంపీ కేశవరావుకు పార్టీ సెక్రటరీ జనరల్ పోస్టు, ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవి, వద్దిరాజు రవిచంద్రకు రాజ్యసభ సభ్యత్వం, బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఆర్టీసీ చైర్మన్ పోస్టు ఇచ్చిన విషయాన్ని రానున్న ఎన్నికల్లో, ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రస్తావించాలని అనుకుంటున్నది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలుగా శంభీపూర్ రాజు, దండ విఠల్, నన్నపనేని నరేందర్, దాస్యం వినయభాస్కర్, దానం నాగేందర్, జోగు రామన్న, వనమా వెంకటేశ్వరరావు, కొరుకంటి చందర్ తదితరులు ఉన్నారని, పార్టీ వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందనే అంశాన్నీ పాపులర్ చేసుకోవాలని భావిస్తున్నది.

మైలేజ్ కోసం ఏపీలోనూ..

ఏపీలోనూ బీఆర్ఎస్‌ను విస్తరింపజేయాలని అనుకుంటున్న గులాబీ బాస్.. అక్కడి రాష్ట్ర అధ్యక్ష పదవిని తోట చంద్రశేఖర్‌కు కట్టబెట్టారు. కాపు సామాజికవర్గ ప్రజలను దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగానే ఆయనకు పదవి ఇచ్చారన్నది ఓపెన్ సీక్రెట్. ఇక్కడి కాపు నాయకులకు ప్రజా ప్రతినిధులుగా, వివిధ పదవుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న అంశాన్ని గొప్పగా చెప్పుకోవడం ద్వారా అక్కడి ఆ కమ్యూనిటీకి దగ్గర కావచ్చనేది గులాబీ పార్టీ ప్లాన్. ఏపీలో ఎలాగూ కాపు ఓటు బ్యాంకు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనున్నది. దీంతో జగన్, చంద్రబాబు, పవన్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయడంతో పాటు బీఆర్ఎస్ నిలదొక్కుకుని గుర్తింపు పొందాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా తోట చంద్రశేఖర్‌ను పార్టీ ఏపీ స్టేట్ చీఫ్‌గా ఎంపిక చేశారు. దాని ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తున్నది.

బీజేపీని ఓన్ చేసుకున్న కమ్యూనిటీ

మున్నూరుకాపు కమ్యూనిటీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఓటర్లు మూడేండ్లుగా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్న టాక్ ఆ కమ్యూనిటీకి చెందిన వాట్సాప్ గ్రూపు సంభాషణల్లో వ్యక్తమవుతున్నది. ఇందుకు కారణాలు కూడా ఆ చాటింగ్‌లోనే కనిపిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులంతా ఈ సామాజికవర్గానికి చెందినవారే. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, భవిష్యత్తులో అనూహ్యంగా పవర్‌లోకి వస్తే బండి సంజయ్ లేదా లక్ష్మణ్‌కు సీఎం అవకాశాలు ఉంటాయని, ఇప్పటివరకూ అలాంటి ఉన్నత పదవులకు నోచుకోలేకపోయిన మున్నూరుకాపుకు తొలిసారి అవకాశం లభిస్తుందన్నది వారి ఆశ, భావన. మరోవైపు ఏపీలో బీజేపీ స్టేట్ చీఫ్‌గా గతంలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ, ఇప్పుడున్న సోము వీర్రాజు కూడా ఈ కమ్యూనిటీకి చెందినవారు కావడంతో తగిన గుర్తింపు ఇచ్చేది ఆ పార్టీ మాత్రమేననే సాధారణ అభిప్రాయం ఆ సామాజికవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఈ సామాజికవర్గం ఓటు బ్యాంకు కీలకమని ముందుగానే గుర్తించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బాధ్యతలను ఆ వ్యూహం ప్రకారమే అప్పగించింది. తెలంగాణలో సైతం అదే స్ట్రాటెజీని అవలంబించింది. లక్ష్మణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంలోనూ ఈ అంశాన్నే కీలకంగా తీసుకున్నది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పలుకుబడి కలిగిన స్థాయిలో ఈ కమ్యూనిటీ ఉన్నా అధికారంలో మాత్రం గుర్తింపునకు నోచుకోలేకపోతున్నదనే అభిప్రాయం మున్నూరుకాపు ప్రజల్లో వ్యక్తమవుతున్నది.

గతంలో కాంగ్రెస్‌పై అభిమానం

దీర్ఘకాలం పాటు కాపు, మున్నూరుకాపు సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపింది. ఏనాడూ అధికారంలో తగిన ప్రాధాన్యం, గుర్తింపు లేదనే అసంతృప్తి ఆ కమ్యూనిటీలో వ్యక్తమయ్యేది. కాంగ్రెస్ రెడ్డిల పార్టీ అనే జనరల్ ఒపీనియన్ కాపు కమ్యూనిటీలోనూ బలంగానే ఉన్నది. ఈ కారణంగానే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన తర్వాత అటువైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్‌లో బొత్స సత్యానారాయణ లాంటివారికి మంత్రి పదవి, పీసీసీ చీఫ్ లాంటివి దక్కినా.. కమ్యూనిటీ కోసం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం ఇప్పటికీ ఆ సామాజిక‌వర్గంలో ఉన్నది. కేంద్రంలో మోడీ పవర్‌లోకి వచ్చిన తర్వాత కాపు, మున్నూరుకాపు కమ్యూనిటీలోని విద్యాధికుల్లో బీజేపీ‌పై సానుకూల వైఖరి ఎస్టాబ్లిష్ అయింది. అటు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు, ఇటు తెలంగాణలో బండి సంజయ్ లాంటివారికి పార్టీ పదవులు ఇవ్వడంతో కాపు కమ్యూనిటీ వారు మరింతగా మురిసిపోయారు.

జనసేనపై విశ్వాసం..

కాపు ఓటు బ్యాంకు ప్రాధాన్యాన్ని గుర్తించిన బీజేపీ రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌తో పొత్తును కంటిన్యూ చేయాలని భావిస్తున్నది. కాపుల ప్రాధాన్యాన్ని చంద్రబాబు సైతం గుర్తించినందున పవన్‌తో దోస్తీని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో కాపు కమ్యూనిటీ పవన్ కళ్యాణ్‌నే ఎక్కువగా విశ్వసిస్తున్నది. గతంతో పోలిస్తే ఈ కమ్యూనిటీ ప్రజల్లో చైతన్యం పెరిగిందని, ఇది ఎన్నికల సమయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని అన్ని పార్టీలూ గ్రహించాయి. అందుకే ఆ కమ్యూనిటీ వారిని ప్రసన్నం చేసుకోవడం తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చాయి. దానికి తగినట్లుగానే రాజకీయ వ్యూహాలను రచించి అమలుచేస్తున్నాయి.

Also Read...

కాళ్ళుకట్టేసి, మూతి కుట్టేసి...పర్మిషన్ ఇస్తారా!

Advertisement

Next Story

Most Viewed