సహకరించండి ప్లీజ్.. కేడర్‌తో ఎవరికి వారుగా గులాబీ ఎమ్మెల్యేల భేటీలు

by Rajesh |
సహకరించండి ప్లీజ్.. కేడర్‌తో ఎవరికి వారుగా గులాబీ ఎమ్మెల్యేల భేటీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలను సుప్రీంలను చేసింది. వారికి పార్టీతో పాటు నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను అప్పగించింది. అయితే పార్టీ అధికారం కోల్పోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలకు తిప్పలు తప్పడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమైన కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో వెనుకంజ వేస్తున్నారు. తిరిగి వారిని మచ్చిక చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకోసం పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు, అనుచరులు, కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందరూ అండగా ఉండాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరితేనే సాధ్యమని, లేకుంటే ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని పేర్కొంటున్నారు. సహకారం అందించాలని విజ్ఞప్తులు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒక్కరే వెళ్లితే గుర్తింపు ఉండదని..

నియోజకవర్గంలో పట్టుకోల్పోకుండా గులాబీ ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ మారినా నేతల్లో, కేడర్ లో వ్యతిరేకత రాకుండా చూసుకుంటున్నారు. అందుకోసం నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగానే రాజేంద్రనగర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించుకున్నట్లు సమాచారం. అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ లో చేరితే తమకు సైతం గుర్తింపు ఉంటుందని భావిస్తూ నేతలను బ్రతిమలాడుకుంటున్నట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులతో కలిసి సాయంత్రం హస్తం గూటికి చేరుతున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కీలక నాయకులతో భారీగా జాయిన్ అవుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యేల్లో మార్పు...

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా మార్పు వచ్చిందని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ద్వితీయస్థాయి నేతలు, కేడర్ కలిసేందుకు వెళ్లినా సమయం ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కోల్పోవడంతో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది పార్టీ మారగా, మరికొందరు సిద్ధమవుతున్నారు. అయితే పార్టీ మారినా నాయకులు, కేడర్ తమతో ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే అడిగిన వారిందరికి అపాయింట్ మెంట్, ఇళ్ల వద్ద అందుబాటులో ఉండటం, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర సైతం నిత్యం అందుబాటులో ఉంటుండటం గమనార్హం. ఎమ్మెల్యేల తీరు చూసి పార్టీ కేడరే అశ్చర్యానికి గురికావడం వారి వంతైంది. ఇదే మార్పు ఎప్పుడు ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed