- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రాజకీయాల్లోకి డాక్టర్ సాబ్.. ఎంట్రీకి రంగం సిద్ధం..!
దిశ, వరంగల్ బ్యూరో: తెలగాణ రాష్ట్ర తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసిన పిల్లి సాంబశివరావు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? రాజకీయ అవకాశం వస్తే ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి ఆసక్తి చూపుతున్నారా..? ఇప్పటికే ఆయనకు పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయా..? అంటే ఆయన సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలువురు రాష్ట్ర స్థాయి నేతలు ఆయనకు టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సాంబశివరావు రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని తెలుస్తుండగా, హామీలను బేరీజు వేసుకుని ఆయా రాజకీయ పార్టీల వైపు మొగ్గు చూపాలనే వైఖరితో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సాంబశివరావు రాజకీయ రంగం ప్రవేశం చేస్తున్నట్లుగా కొద్దిరోజులుగా వైద్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు కూడా ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. రాజకీయ పార్టీల ఆహ్వానాలను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుండటం గమనార్హం. అవకాశాలను అంచనా వేస్తూనే సరైన వేదికను ఎంచుకోవాలనే దృక్పథంతో ఉన్నట్లు 'దిశ'కు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
డాక్టర్‌గా.. ఐఎంఏ నాయకుడిగా చెరగని ముద్ర..!
తెలగాణ రాష్ట్ర తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసిన పిల్లి సాంబశివరావు ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యశాఖపై ప్రత్యేక ముద్ర వేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతీకరణ, వైద్య సేవల మెరుగుదలలో సంస్కరణలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా డీఎం అండ్ హెచ్‌వోగా సుదీర్ఘకాలం పనిచేసిన సాంబశివరావు దాదాపు 30 సంవత్సరాలు వరంగల్ జిల్లాలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 1986లో ప్రభుత్వ సర్వీస్‌లో చేరిన ఆయన తొలుత ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణ్ చందా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడి నుంచి 1991లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా చేరి విధులు నిర్వర్తించారు. ఎంజీఎం ఆర్ ఎంవోగా, వరంగల్ డీఎం అండ్ హెచ్‌వోగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. వరంగల్ జోన్ రీజినల్ డైరెక్టర్ నియమించబడి అప్పటి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలో సేవలు అందించారు. అనంతరం తెలగాణ రాష్ట్ర తొలి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారిగా నియమించబడ్డారు. శాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఐఏఎస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సిన మూడు శాఖల అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించడం గమనార్హం. ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య రంగంలో అనేక కీలక నిర్ణయాలకు ఆయన ప్రతిపాదనలే కీలకమయ్యాయి. ఎంజీఎం సహా అనేక ఆస్పత్రుల మెరుగుకు విశేషమైన కృషి చేశారనే చెప్పాలి. వైద్య అధికారిగానే కాక ఐఎంఏలో అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన ఆయనకు ఉమ్మడి జిల్లాలో వైద్య వర్గాల్లో మంచి పలుకుబడి కూడా ఉంది. వైద్యుల హక్కుల రక్షణకు కృషి చేస్తూనే రోగులకు మెరుగైన సేవలందించడంలో సఫలీకృతుడయ్యారని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్లో, వైద్య వర్గాల ప్రముఖులు కొనియాడుతుంటారు. ఐఎంఏ నాయకుడిగా, ఒక డాక్టరుగా సాంబశివరావు అనేక సందర్భాల్లో మానవతా దృక్పథంతో స్పందించారు. ఐఎంఏ నుంచి అనేక వైద్య, సేవా కార్యక్రమాలు చేపట్టారు.
పేదలకు డాక్టర్ సాబ్
వరంగల్ జేపీఎన్ రోడ్‌లో గత 30 ఏళ్లుగా ప్రైవేటుగా వైద్యసేవలను అందిస్తున్న ఆయన వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. ముఖ్యంగా ఎల్‌బీనగర్, కరీమాబాద్, మిల్స్ కాలనీ, లేబర్ కాలనీ, కొత్తవాడ, ఎల్లంబజార్, మండి బజార్ పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేశారు. ఈ ప్రాంత ప్రజలు సాంబశివరావును డాక్టర్ సాబ్ అంటూ ఇష్టంగా పిలిచుకుంటారు. ఐఎంఎ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వరుసగా రెండుసార్లు ఎన్నికైన ఆయన వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా హమాలీ, ఇతర కూలీలు, రైతుల ఆరోగ్య పరిరక్షణకు విశేషంగా కృషి చేశారు. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సీఐటీయూ కార్మిక సంఘం, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో ఉచితంగా వైద్యం అందించారు. వరంగల్ తూర్పులో పదుల సంఖ్యలోని మురికివాడల ప్రజలకు, వరంగల్ మార్కెట్ హామాలీలకు, పేద, బడుగు వర్గాలతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలు పెరగడానికి ప్రధాన కారణమిదేనని సాంబశివరావు సన్నిహితులు చెబుతుంటారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. అలాగే ములుగు ఏజెన్సీలో మెదడువాపు, మలేరియా ఉధృతిని నివారించడానికి విశేషమైన కృషి చేశారని ఆయన సన్నిహితులు సాంబశివరావు సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని వేరు చేసి చూడలేమని చెబుతుంటారు ఆయన సన్నిహితులు.
వైద్య వర్గాల మద్దతు..!
'దిశ'కు అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. ఓ రాజకీయ పార్టీ సాంబశివరావును ఎలాగైనా పార్టీలోకి రప్పించాలని ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సాంబశివరావును పార్టీలోకి రప్పించడం ద్వారా ఖచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతుందని, వైద్య వర్గాలకు చెందిన మద్దతుతో పాటు.. కొన్ని వర్గాలకు చెందిన ప్రజల ఓటు బ్యాంకును సాధించినవారిమవుతామనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది ప్రజాప్రతినిధుల విజయాల వెనుక కొంతమంది వైద్యుల పరోక్ష సహకారం ఉంటుందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సర్వీసులో సుదీర్ఘకాలంగా పనిచేసిన డాక్టర్ సాంబశివరావు పొలిటికల్ ఎంట్రీపై వైద్య వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై వైద్య వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ అంచనాలున్నాయి. ఆయన రాజకీయ ఆరంభంపై అనేక రకాల విశ్లేషణలు కొనసాగుతుండటం గమనార్హం. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఆదరాభిమానాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలోనైనా వ్యక్తిగత చరిష్మాతో ఒక స్థిరమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోగలుగుతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్వయించుకుంటే ఆయన చేరబోయే పార్టీకి బలమైన ఓటుబ్యాంకును సమకూర్చగలుగుతారన్న విశ్లేషణ చేస్తున్నారు. మొత్తంగా డాక్టర్ సాంబశివరావు రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుంది..? ఆయన ఏ పార్టీ గూటికి చేరబోతున్నారు..? ఆహ్వానాలు.. అంచనాల మధ్య ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలంటే వేచి చూడక తప్పదు.