Phone tapping case : సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు..జనవరి 2వ తేదీకి విచారణ వాయిదా !

by Y. Venkata Narasimha Reddy |
Phone tapping case : సుప్రీం కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు..జనవరి 2వ తేదీకి విచారణ వాయిదా !
X

దిశ, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్(Phone tapping case) కేసు ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. కేసులో కీలక నిందితుల్లో ఒకరుగా ఉన్న (Thirupathanna) అదనపు ఏస్పీ తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. బుధవారం జరిగిన విచారణ సందర్భంగా తిరుపతన్న పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో విచారణను ఎల్లుండికి వాయిదా వేయాలని తిరుపతన్న తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. ఎల్లుండి హాజరు మాకు సాధ్యం కాదని, క్రిస్మస్ సెలవుల అనంతరం విచారించాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. దీంతో జస్టిస్ బీ.వి.నాగరత్నం, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ల ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన తిరుపతన్న బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. తిరుపతన్నకు బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తిరుపతన్న పిటిషన్ దాఖలు చేశారు. ఆక్టోబర్ 24వ తేదీన జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ ఫైల్ చేసి మూడు నెలలు అయిన తర్వాత కూడా హైకోర్టు బెయిల్ ఎందుకు నిరాకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి నవంబర్ 27న మరో దఫా విచారణ కొనసాగిన పిదప డిసెంబర్ 18న విచారణ చేపట్టింది. పిటిషనర్, ప్రభుత్వం తరుపు న్యాయవాదుల అభ్యర్థన మేరకు తదుపరి విచారణ జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

గత ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన సమయంలో ఎస్ఐబీ కార్యాలయంలోని పలు హార్డ్ డిస్క్ లను డీఎస్సీ ప్రణిత్ రావు బృందం ధ్వంసం చేయడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై సీట్ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) అదనపు ఎస్పీ తిరుపతన్న ఏ4 నిందితుడిగా ఉన్నారు. గత ఎనిమిది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్ఐబీ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేృతృత్వంలో పలువురు ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడగా... ఈ కేసులో అప్పటి ఎస్ఐబీ అధికారులు ప్రణిత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్టీ రాధాకిషన్ రావులను అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీట్ సైతం దాఖలుచేశారు. అయితే, కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో కీలక నిందితుడు శ్రవణ్ కుమార్ అమెరికాలో ఉండటంతో విచారణ మందగించింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని దర్యాప్తు అధికారులు సీబీఐ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story