గ్రూపు-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని పిటిషన్.. టీఎస్ పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు!

by GSrikanth |   ( Updated:2023-06-22 12:32:56.0  )
గ్రూపు-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలని పిటిషన్.. టీఎస్ పీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓఎంఐర్‌పై హాల్ టికెట్ నెంబర్, ఫొటో ఎందుకు లేదని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్ పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఓఎంఆర్ షీటుపై హాల్ టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన కోర్టు అక్టోబర్‌లో నిర్వహించిన మాదిరిగా ఈసారి ఎందుకు పరీక్షను నిర్వహించలేదని ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాలు నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించింది. దీంతో కమిషన్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పరీక్షల ఏర్పాట్లు అనేవి టీఎస్ పీఎస్సీ విచక్షణ అధికారమని కోర్టు దృష్టికి తీసుకుచ్చారు.

బయోమెట్రిక్, ఓఎంఆర్‌పై ఫొటో అనేది ఖర్చుతో కూడుకుందని దీనికోసం సుమారు రూ.1.50 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అయితే ఆధార్ వంటి గుర్తింపు కార్డు ద్వారా ఇన్విజిలేటర్ల అభ్యర్థులను ధృవీకరించారని కోర్టుకు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను చాలామంది రాసినప్పటికీ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని కేవలం ముగ్గురు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల వద్ద నుండి డబ్బులు తీసుకున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల విషయంలో ఖర్చులు ముఖ్యం కాదని పేర్కొంది. పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్ పీఎస్సీ బాధ్యత అని ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ దీనిపై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది.

Also Read..

సార్! మమ్మల్ని ఏపీకి తీసుకుపొండి.. ఏపీ సీఎం జగన్ కు హోంగార్డుల వినతి

Advertisement

Next Story

Most Viewed