ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని వేడుకోలు

by Gantepaka Srikanth |
ప్రజల ప్రాణాలతో చెలగాటం.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని వేడుకోలు
X

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సువెన్ ఫార్మా కంపెనీని దూరప్రాంతాలకు తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సువెన్ ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాలు, మున్సిపాలిటీలోని 5వ, 6వ వార్డులో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు శ్వాసకోస, కిడ్నీ, గుండె జబ్బుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. విషాన్ని విడుదల చేస్తూ వాతావరణం అంతా కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తం అవుతోంది. వ్యర్థ జలాలను రాత్రిపూట చుట్టుపక్కల పొలాల్లోకి వదులుతూ ప్రజలకు హాని కలిగిస్తుందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సువెన్ కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలని వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్థానిక ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున సువెన్ కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

దిశ బ్యూరో, నల్గొండ: సూర్యాపేట జిల్లా కేంద్రంలో విషాన్ని విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న సువెన్ ఫార్మా కంపెనీని దూరప్రాంతాలకు తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సువెన్ ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాలు, మున్సిపాలిటీలోని 5వ, 6వ వార్డులో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలతో ప్రజలకు శ్వాసకోస, కిడ్నీ, గుండె జబ్బుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. వాతావరణం అంతా కలుషితం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మొదట్లో 23 టీఎంపీ ఉన్న కంపెనీ ప్రస్తుతం 250టీఎంపీకి పెంచారు. దీనికి అనుమతులు ఎలా వచ్చాయని, 23టీఎంపీ ఉంటేనే పొల్యూషన్ ఎక్కువగా ఉందని, అదే విధంగా 250టీఎంపీ పెంచితే ప్రజలు ఎలా జీవించాలని స్థానికులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థ జలాలను రాత్రిపూట చుట్టుపక్కల పొలాల్లోకి వదులుతూ ప్రజలకు హాని కలిగిస్తుందని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. సువెన్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న తండాలతోపాటు జిల్లా కేంద్రం కూడా పొల్యూషన్ బారినపడి సతమతమవుతుంటే ప్రలోభాలకు గురైన రాజకీయ నాయకులకు అనేకసార్లు విన్నవించినా గిరిజన ప్రజల మీద ఏమాత్రం దయ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య మీద ఎవరు పోరాడితే వాళ్లని బెదిరించి జైల్లో పెట్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సువెన్ కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలని వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, స్థానిక ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సువెన్ కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలని సువెన్ కంపెనీ వల్ల నష్ట పోతున్న ప్రజలతో కలిసి కలెక్టర్‌కు సమస్యలను విన్నవించిన వారిలో ప్రస్తుతం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి కూడా ప్రజల పక్షాన పోరాటం చేశారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు బాధ్యత తీసుకుని సువెన్ కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కంపెనీని తరలించాలి..

సూర్యాపేటలోని సువెన్ ఫార్మా కంపెనీలో గతంలో అనేక ప్రమాదాలు జరిగినా అధికారులు ముడుపులకు ఆశపడి ప్రమాదలను బయటకు తెలియకుండా దాచినట్లు సమాచారం. అచ్యుతాపురం ఫార్మసీలోని ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో సుమారు 20మంది చనిపోయారు. మరి ఎంతోమంది చావు బతుకుల్లో ఉన్నారు. సువెన్ ఫార్మా కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిశ్రమ చుట్టూ ఉన్న వస్త్రంతండా, దురాజ్‌పల్లి, శాంతినగర్, లాల్‌సింగ్ తండా, దాసాయిగూడెం, రూప్లాతండా, రామ్లతండా, ఇమాంపేట గ్రామాల ప్రజలకు పెను ప్రమాదమే పొంచి ఉంది. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సువెన్ ఫార్మా ఫ్యాక్టరీ సేఫ్టీ ఉత్పాదక ప్రమాణాలు పరిశీలించి నష్టపోతున్న రైతులకు పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్‌లు సువెన్ పార్మా కంపెనీ యాజమాన్యం కట్టే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సువెన్ ఫార్మా ఫ్యాక్టరీని దూర ప్రాంతాలకు తరలించి సమీప గ్రామాల ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు.

రక్షణ కల్పించండి : నాగునాయక్, వస్త్రంతండా

సెవెన్ ఫార్మాలో ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం శ్మశానవాటికగా మారే ప్రమాదం ఉంది. కంపెనీనుంచి వెలువడే గాలి, నీటి వ్యర్థాల వల్ల వాతావరణం, నీళ్లు పూర్తిగా కలుషితమయ్యాయి. పంటలు సరిగా పడడం లేదు. అనారోగ్యాల బారిన పడుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సువెన్ ఫార్మా కంపెనీని దూర ప్రాంతాలకు తరలించాలి. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

Advertisement

Next Story

Most Viewed