వ్యక్తులు ముఖ్యం కాదు... పార్టీయే ముఖ్యం : మంత్రి పువ్వాడ

by Nagaya |   ( Updated:2023-01-19 14:14:18.0  )
వ్యక్తులు ముఖ్యం కాదు... పార్టీయే ముఖ్యం : మంత్రి పువ్వాడ
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యక్తులు ముఖ్యం కాదు... పార్టీయే ముఖ్యమని.. కేసీఆరే సుప్రీం అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సభకు రావాలని బొట్టుపెట్టి ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మొదటిసభ సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. అందరి సమన్వయంతో సభ విజయవంతమైందని, ఖమ్మం చరిత్రలోనే ఇంత పెద్ద సభ ఎప్పుడు జరుగలేదన్నారు. ఈ సభతో కేసీఆర్, మిగతా నేతలు దేశానికి దిశా నిర్దేశం చేశారని, కేవలం 10రోజుల వ్యవధిలోనే విజయవంతం చేశామన్నారు. ఖమ్మం అభివృద్ధికి గుమ్మంలా మారిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి సుపారీలు అవసరం లేదని, వాళ్ళ నేతలే చాలు అన్నారు. సభ ప్లాప్ అయిందని అంటున్న బండి సంజయ్ కంటి వెలుగు పథకంలో కళ్ళ పరీక్ష చేసుకుంటే మంచిది.. లేదంటే మేమే ఓ టీంను పంపిస్తామని వెల్లడించారు. సభ తో దేశ రాజకీయాలే కాదు ఖమ్మం రాజకీయాలు కూడా మారుతాయని స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం సభ జాతీయ రాజకీయాల్లో మార్పులకు నాంది కానుందన్నారు. ప్రగతి శీల శక్తుల కలయిక కు ఖమ్మం సభ బాటలు వేసిందన్నారు. దేశ సంపదను ఇద్దరు గుజారాతీలు మరో గుజారాతికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ ఆటలు ఇక చెల్లవు అని ఖమ్మం సభ సందేశం ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ ను ఇస్తున్నట్టే దేశ వ్యాప్తంగా ఇస్తామని, విద్యుత్ రంగాన్ని కూడా ఆదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని, దీన్ని కూడా ఉద్యోగులతో కలిసి ప్రతిఘటిస్తామని, రైతుల ఆందోళనలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. ఖమ్మం సభ ఆరంభం మాత్రమేనని, ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కచ్చితమైన మార్పు దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఆధారాలు లేకుండా అవినీతి పై ఆరోపణలు చేసే వారి గురించి మాట్లాడలేమన్నారు. ఎంపీ వద్ధి రాజు రవి చంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రబలమైన శక్తిగా మారడానికి ఖమ్మం సభ బాటలు వేయబోతోందన్నారు. బీజేపీకి ఖమ్మం జిల్లాలో స్థానం లేదని తేలిపోయిందని, డిపాజిట్లు కూడా రావు అని, బీఆర్ఎస్ పదికి పది స్థానాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గదొన్నారు.

Advertisement

Next Story

Most Viewed