PC Ghosh commission: దస్త్రాలు పరిశీలించకుండానే అఫిడవిట్ ఎలా ఇస్తారు? సీఈపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం

by Prasad Jukanti |
PC Ghosh commission: దస్త్రాలు పరిశీలించకుండానే అఫిడవిట్ ఎలా ఇస్తారు? సీఈపై కాళేశ్వరం కమిషన్  ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ బుధవారం విచారణ జరిపింది. ఇవాళ జరిగిన విచారణకు కాళేశ్వరం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్, క్వాలిటీ కంట్రోల్ చీప్ ఇంజినీర్ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేందర్ పై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. దాదాపు మూడు గంటల పాటు 130కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పూర్తి అయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ లో నిబంధనలు పాటించలేదని, రామగుండం ఈన్సీ చేతిలోనే మూడు బ్యారేజీలు నడిచినట్లు కమిషన్ కు నాగేందర్ వివరించారు. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లే బ్యారేజీలలో లీకేజీలు జరిగాయా? గేట్స్ ఆపరేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి? నీళ్లను ఎవరు స్టోరేజ్ చేయమన్నారని కమిషన్ ప్రశ్నించింది. కాగా రామగుండం ఈఎన్సీ నిబంధనలు పాటించలేదని కమిషన్ ముందు నాగేందర్ చెప్పినట్లు తెలుస్తోంది.

దస్త్రాలు పరిశీలించకుండానే అఫిడవిట్ ఎలా ఇస్తారు?

మరోవైపు కాళేశ్వరం కంట్రోల్ చీఫ్ ఇంజినీర్ అజయ్ కుమార్ తీరుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్ని సార్లు సందర్శించారని కమిషన్ ప్రశ్నించగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు ప్రమాదం జరగకముందు పరిశీలించానని అజయ్ బదులిచారు. దాంతో సుందిళ్ల బ్యారేజీని ఎందుకు పరిశీలించలేదు? తొలిసారి వరద వచ్చాక 3 బ్యారేజీలను సందర్శించారా అని కమిషన్ ప్రశ్నించింది. సమస్యలు ఉన్నాయని నివేదిక రాకపోవడంతో సందర్శించలేదని జవాబిచ్చారు. అయితే క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని కమిషన్ నిలదీశింది.

Advertisement

Next Story

Most Viewed