3 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు..

by Vinod kumar |
3 లక్షలు దాటిన ఎంసెట్ దరఖాస్తులు..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసేందుకు 3,05,185 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఎంసెట్ విభాగంలోనే 1,95,515 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌లో 1,09,335 మంది, ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్, మెడికల్ విభాగానికి కలిపి 335 మంది విద్యార్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇంజినీరిగ్, మెడికల్ ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో అప్లికేషన్ చేసుకునేందుకు మాత్రం అవకాశం ఉంది. ఫిబ్రదరి 28వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు మార్చి 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రారంభించారు.

రూ.250 లేట్ ఫీజుతో ఏప్రిల్ 15వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు, రూ.2500 ఫీజుతో ఈనెల 25వ తేదీ వరకు, రూ.5000 ఆలస్య రుసుముతో మే2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి పరీక్షను మే 10, 11 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగం పరీక్షను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఇంజినీరింగ్ విభాగం పరీక్షను మే 7, 8, 9 తేదీల్లో నిర్వహించాల్సి ఉండగా యూజీ నీట్, టీఎస్ పీఎస్సీ పరీక్షలు ఉండడంతో వాయిదా వేశారు. ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed