ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎదురుగాలి!

by Seetharam |   ( Updated:2023-06-07 14:44:53.0  )
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఎదురుగాలి!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీలు ముప్పేట దాడిని మొదలుపెట్టాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో ఆయన సఖ్యతగా లేరని తెలిసింది. ఇటీవల మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి వచ్చి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే నియోజకవర్గం మరో బీఆర్ఎస్ నాయకులు ఎం.రామ్మోహన్ గౌడ్, అతని అనుచరులపై ఎమ్మెల్యేవర్గం దాడికి ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సైతం ఆయనను మందలించినట్లు తెలిసింది. ఈ వివాదం తెరమరుగు కాకముందే లింగోజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ పై దాడి చేయడం వివాదాస్పదమైంది. ఇలా నాలుగు రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటు చేసుకోగా తాజాగా బీజేపీ నాయకులు కూడా ఆయనపై కరపత్రం ముద్రించి యుద్ధం మొదలు పెట్టారు. చంపాపేట్ బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని ప్రశ్నిస్తూ కరపత్రాలు ముద్రించి నియోజకవర్గం వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇప్పటికే వంగా మధుసూదన్‌రెడ్డి ఫేస్ బుక్ తదితర సోషల్ మీడియాలో సుథీర్ రెడ్డిపై దుమ్మెత్తి పోస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. ఇవి ఓ వైపు హల్‌చల్ చేస్తుండగానే మరోవైపు కరపత్రాలు ముద్రించి ఓటర్లకు వాస్తవ పరిస్థితులు చేరవేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. మరో ఆరు నెలలలోపే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆయనను టార్గెట్ చేయడంతో రాబోయే ఎన్నికలలో గడ్డుపరిస్థితిని ఎదుర్కోబోతున్నారని నియోజకవర్గంలోని ఓటర్లు చర్చించుకుంటున్నారు.

ఊకదంపుడు ఉపాన్యాసాలు..

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమయ్యారని చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో ఎన్నో పాఠశాలలు అక్రమంగా అనుమతి, మౌలిక సదుపాయాలు లేకుండా ఇరుకు భవనాలలో నడుస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. బడి పిల్లల సమస్యలు ఎమ్మెల్యేకు కనబడడం లేదా? వారి తల్లిదండ్రుల కష్టం కనిపించడం లేదా? మీరు సంపాదించుకోవడం కోసమేనా ఈ కార్పొరేట్ బడులు అంటూ కరపత్రం ద్వారా ప్రశ్నలు సందించారు. బీజేపీ అధికారంలోకి రాగా యూపీ తరహాలో 100కు వందశాతం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed