కేసీఆర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కీలక నేతలు.. అందుకే సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా?

by GSrikanth |   ( Updated:2023-02-14 00:00:37.0  )
కేసీఆర్ ఆహ్వానాన్ని తిరస్కరించిన కీలక నేతలు.. అందుకే సెక్రటేరియట్ ఓపెనింగ్ వాయిదా?
X

సెక్రటేరియట్ ఓపెనింగ్ కు తాము రాలేమని తమిళనాడు సీఎం స్టాలిన్, బిహార్ డిప్యూటీ సీఎం స్టాలిన్ సమాచారం పంపినట్లు తెలిసింది. సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడానికి ఇదీ ఒక కారణంగా ప్రచారం జరుగుతున్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గెస్టులను పిలవడానికి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ వాయిదా పడడంపై రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూలు ప్రకారం ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం రోజునే ప్రారంభించాల్సి ఉన్నది. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ హాజరవుతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో అనుకున్న సమయానికి పనులను పూర్తిచేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది సరైన కారణం కాదంటూ విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

రాజకీయ కారణాలతో..

రాజకీయపరమైన కారణాలతో స్టాలిన్, తేజస్వి యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్దేశంలేదని తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమిలో ఉంటూ కేసీఆర్ ఆహ్వానం మేరకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో స్టాలిన్ ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్‌ తో కొనసాగుతూనే మరోవైపు దానికి వ్యతిరేకంగా పెట్టే బీఆర్ఎస్ ఈవెంట్‌ కు వెళ్లడం పొలిటికల్‌ గా చర్చకు దారితీస్తుందనే అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తేజస్వి యాదవ్ సైతం పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగానే ఈ ప్రోగ్రామ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

బిహార్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినందున బీఆర్ఎస్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటే అది రాష్ట్రంలో వివాదంగా మారుతుందనే ఆందోళనతోనే గైర్హాజరు కావాలనుకుంటున్నట్లు తెలిసింది. సచివాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యే వీరిని అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు కూడా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావించింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ హాజరుకానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినా, ఆయన రాకపై స్పష్టత రాలేదు. జార్ఖండ్ ముక్తిమోర్చా పార్టీ సైతం కాంగ్రెస్‌ తో స్నేహ సంబంధాల్లోనే ఉన్నది. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నందున కేసీఆర్ ఆహ్వానం మేరకు హాజరుకావడంపై మొదటి నుంచీ అనుమానాలు ఉన్నాయి.

అనేక అనుమానాలు..

కొత్త సచివాలయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేయడం వెనక అనేక అనుమానాలు ఉన్నాయి. విపక్షాలు సైతం కొన్నింటిని ప్రస్తావించి విమర్శలు చేశాయి. అగ్నిప్రమాదం జరిగినందునే వాయిదా వేసిందనే వార్తలూ వచ్చాయి. తుది దశ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయని, ప్రారంభోత్సవం తేదీ నాటికి పూర్తికావనే ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపి ప్రభుత్వం వాయిదా వేసిందనే ఊహాగానాలూ వినిపించాయి. పుట్టినరోజు వ్యక్తిగతమైన అంశమని, పాలనకు సంబంధించిన కార్యక్రమాలకు ఆ తేదీన ముహూర్తం ఖరారు చేయడం సమంజసం కాదన్న విమర్శలూ వచ్చాయి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసి సుమోటోగా తీసుకోవాలని కోరారు. ఒకేసారి అన్ని పార్టీల నుంచి విమర్శలు రావడం, ప్రజల నుంచి అనుమానాలు తలెత్తడం ఎలా ఉన్నా రాజకీయ కారణాలతో గెస్టులుగా రావాల్సిన స్టాలిన్, తేజస్వి రాకపోవడం కారణంగానే వాయిదా వేశారనే చర్చ జరుగుతున్నది.

ముందుగానే అలర్ట్..

ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమానికి ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులను ఆహ్వానించిన కేసీఆర్ ఆ రోజు జరిగిన బహిరంగసభలో సైతం వారు హాజరయ్యేలా చూసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి పొలిటికల్ మీటింగులోనూ పాల్గొనేలా చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు బహిరంగంగానే కామెంట్ చేశారు. ఈసారి సైతం అదే తరహా రిపీట్ అయ్యే అవకాశాలతో ముందుగానే స్టాలిన్, తేజస్వి అలర్టయినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed