పోలీసు దెబ్బలతో ఒకరు బలవన్మరణం..మరొకరు ఆత్మహత్యాయత్నం

by Y. Venkata Narasimha Reddy |
పోలీసు దెబ్బలతో ఒకరు బలవన్మరణం..మరొకరు ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసుల అతిచర్యలతో ఒకరు బలవన్మరణానికి పాల్పడగా, మరొకరు ఆత్మహత్య యత్నం చేసుకుని ఆసుపత్రి పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు హనుమకొండ జిల్లా హసన్ పర్తి ఎస్ఐ దేవేందర్ వేధింపులు తాళలేక అశోక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 24న ఓ దొంగతనం కేసులో విచారణకు అశోక్ ను ఎస్సై దేవేందర్ పోలీస్ స్టేషన్ కు పిలిపించాడు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని ఆ రోజంతా అశోక్ ను ఎస్ఐ దేవేందర్ చితకబాదాడు. వరుసగా మూడు రోజులు స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ చిత్రహింసలు పెట్టాడు. ఆ దెబ్బలకు భరించలేక, మళ్ళీ పోలీస్ స్టేషన్ కు పిలుస్తారనే భయంతో అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. అశోక్ ఆత్మహత్యకు కారణమైన హసనపర్తి ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరో ఘటనలో జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ కొట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బాధితుడి సోదరి కథనం మేరకు కుటుంబ కలహాల నేపథ్యంలో శివప్రసాద్‌ అనే వ్యక్తిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఈ నెల 19న అతని భార్య కవిత ఫిర్యాదు చేసింది. ఈ నెల 22న కౌన్సిలింగ్ పేరుతో శివ ప్రసాద్‌ను స్టేషన్‌కు పిలిపించిన కోరుట్ల ఎస్సై‌ శ్వేత చేయి చేసుకుంది. అది అవమానంగా భావించిన శివ ప్రసాద్‌ మరుసటిరోజు ఉదయం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన శివప్రసాద్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed