- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీలక సమాచారాన్ని లీక్ చేస్తున్న ఆఫీసర్లు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్ర!
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం మారినా ఇంకా అనేక మంది అధికారులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. కొన్ని చోట్ల కలెక్టర్లు మారినా.. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు అలాగే కొనసాగుతున్నారు. వీరిలో చాలా మంది గత ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసుతోనే పోస్టింగ్ సంపాదించుకున్నారన్న ప్రచారం ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓ ఎమ్మెల్సీ సిఫారసుతో కొందరు తహసీల్దార్లు పోస్టింగులు పొందినట్లు తెలిసింది. అందుకే ఏ ఫైల్ టేబుల్ మీదికి వచ్చినా సదరు ఎమ్మెల్సీ దృష్టికి క్షణాల్లో వెళ్లేదని, ఆ తర్వాత.. ఒకటీ రెండు రోజుల్లోనే డీల్ సెటిలయ్యేదన్న ప్రచారం ఉన్నది. ఇప్పటికీ ఆ అధికారులు ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ‘మాజీ’లకు లీక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సీసీఎల్ఏ, కలెక్టర్ నుంచి వచ్చే ఆదేశాలను వారికి చెప్పేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిఫారసులతో పోస్టింగ్స్ పొందిన తహసీల్దార్ల ప్రైవేటు మొబైల్ నంబర్లను చెక్ చేస్తే సదరు ఎమ్మెల్సీకి రోజుకు ఎన్నిసార్లు కాల్ చేశారో, ఎంత సమయం మాట్లాడారో బయటపడుతుందని ఓ అధికారి చెప్పడం గమనార్హం.
పేషీల్లో తిష్టవేసే ప్రయత్నాలు
వందల ఎకరాలకు ఎన్వోసీ, ఓఆర్సీలు జారీ చేసిన ఓ తహసీల్దార్ ఏకంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేషీలో తిష్ట వేసేందుకు తీవ్ర స్థాయిలో పైరవీ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారుల్లోనే చర్చ జరుగుతున్నది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఓ డిప్యూటీ కలెక్టర్ కూడా ఇప్పుడు కీలకంగా మారారన్న ప్రచారం ఉన్నది. మరికొందరు ఇతర మంత్రుల దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం పొంది పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
సమాచారం లీక్ అవుతుండడంతో..
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రిపోర్టు అడిగినా కొందరు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆ సమాచారం నిమిషాల్లో తెలిసిపోతున్నట్లు సమాచారం. జీఓ 59 అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు సిద్ధం కాగా, కొందరు నేతలకు తెలిసిపోయింది. దీంతో కన్వెయన్స్ డీడ్స్ పొందగానే సదరు పట్టాదారులు వెంటనే కంపెనీలకు ఆ స్థలాలను అమ్మేశారు. ముందుస్తు ఒప్పందాలతోనే గంటల వ్యవధిలోనే సేల్ డీడ్స్ రూపుదిద్దుకున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లోనే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పర్మిషన్లు కూడా వచ్చేశాయి. ఇప్పుడీ కన్వెయన్స్ డీడ్స్‌ను రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే కోర్టును ఆశ్రయించాలంటూ సదరు అధికారులే కంపెనీలకు సలహాలు ఇస్తున్నారని తెలిసింది. అధికారులు సమాచారాన్ని లీక్ చేస్తుండడంతోనే ప్రభుత్వం చేపట్టే యాక్షన్‌కి ముందే అవతలి నుంచి రియాక్షన్ కనిపిస్తున్నట్లు అర్థమవుతున్నది.
చీకటి దందా
రంగారెడ్డి జిల్లాలో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ సహకారంతో గండిపేట, శేరిలింగంపల్లి, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల్లో జీవో 59 అక్రమాలు జోరుగా సాగాయన్న ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి దరఖాస్తులకు గండిపేట తహసీల్దార్, గండిపేట దరఖాస్తులను మరో మండల అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు తమకేం సంబంధమంటూ వారు తప్పించుకుంటున్నారు. ఎవరు రిపోర్ట్ ఇచ్చినా క్రాస్ చెస్ చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక తహసీల్దార్‌దే. అలా చేయకుండా ఖరీదైన స్థలాలను రాసిచ్చేసినట్లు అర్థమవుతున్నది.
నానక్ రాంగూడలో ఒక కుటుంబానికి మూడు, మరో కుటుంబానికి ఏడు పెద్ద పెద్ద ల్యాండ్ పార్శిళ్లను కట్టబెట్టారు. బి/4039/2023, బి/4040/2023, బి/4041/2023, బి/5039/2023, బి/5040/2023, బి/5041/2023, బి/5042/2023, బి/5043/2023, బి/5044/2023, బి/5045/2023 వంటి ఫైళ్లకు సంబంధించిన కన్వెయన్స్ డీడ్స్ ఏ సమయంలో చేశారో లెక్కలు తీస్తే అవినీతి బాగోతం బయటపడుతుంది. ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 490 గజాల నుంచి 950 గజాల వరకు ఉన్నది. ప్రతి ప్లాట్ విలువ రూ.కోట్లల్లో ఉంటుంది. కన్వెయన్స్ డీడ్స్ రాత్రి పూట చేశారని రికార్డుల్లోనే స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా గోపన్‌పల్లి, ఖాజాగూడ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో శేరిలింగంపల్లి తహసీల్దార్ టి.శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ కె.ఫ్రాంక్లిన్ కృపాల్ కుమార్‌లు రాత్రి 7 గంటల తర్వాత కన్వెయన్స్ డీడ్స్ చేశారు.
గంటల్లోనే కంపెనీలకు..
చీకట్లో కన్వెయన్స్ డీడ్స్ ద్వారా రూ.కోట్ల విలువైన స్థలాలను పొందిన వారి నుంచి.. రెండు, మూడు గంటల్లోనే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్నాయి. సేల్ డీడ్ టైప్ చేయడం, ఆ విస్తీర్ణానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీ కట్టేందుకు బ్యాంకు చాలానా కట్టాలి. ఈ ప్రక్రియకు సామాన్యులకైతే కనీసం ఒక రోజు పడుతుంది. కన్వెయన్స్ డీడ్స్ జారీ చేసిన రెండు గంటల్లోనే ఈ ప్రక్రియ ముగిసింది. అంటే ముందుగానే అధికారులు, పట్టాదారులు, కొనుగోలు చేసే కంపెనీ యజమానుల మధ్య ఒప్పందాలు కుదిరితే తప్ప సాధ్యం కాదు. అప్పటికే ఎంత విస్తీర్ణం, ఏ ఊరు, దాని మార్కెట్ విలువ ఎంత? ఇవన్నీ ముందే చేరవేశారు.
అందుకే కన్వెయన్స్ డీడ్స్ కంటే ముందే బ్యాంకులో స్టాంపు డ్యూటీ చలానాలు కట్టారని స్పష్టమవుతున్నది. అయితే జీవో 59 కన్వెయన్స్ డీడ్స్ రద్దు చేస్తే వెంటనే కోర్టును ఆశ్రయించాలంటూ కొందరు రెవెన్యూ అధికారులే ప్రైవేటు కంపెనీలకు సలహా ఇస్తున్నట్లు తెలిసింది. కన్వెయన్స్ డీడ్స్ నుంచి సేల్ డీడ్స్ కూడా పూర్తయ్యాయి. అదే స్థలాల్లో హైరైజ్ బిల్డింగ్స్ నిర్మాణాలకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పర్మిషన్లు ఇచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎట్లా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేయాలని సమాచారం ఇచ్చారు. పైగా ఇప్పటికే రూ.కోట్లు ఖర్చు చేశాం, నిర్మాణాలకు బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చాయన్న అంశాలను గుర్తు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్రలు సాగిస్తున్నట్లు తెలిసింది.