ఆఫీసర్ల కసరత్తు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అప్పుడేనా?

by Rajesh |
ఆఫీసర్ల కసరత్తు.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ అప్పుడేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాలపై అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన ఓఎంఆర్ ఇమేజింగ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అతి త్వరలో గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే దానిపై అభ్యర్థుల్లో టెన్షన్

నెలకొంది. మెయిన్స్‌కు 1:50కి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని క్యాండిడేట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై హైదరాబాద్‌లో ఇప్పటికే అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ మెయిన్స్‌కు క్యాండిడేట్స్‌ను 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు జరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల ఏ విధంగా ఎంపిక చేయాలనే విషయంపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత వచ్చే చాన్స్ ఉంది.

టీజీపీఎస్సీ ఆఫీసర్లు ఫలితాలను త్వరగా రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సారి మెయిన్స్‌ను ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనేదే ఉత్కంఠగా మారింది. ఈ పరీక్షకు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా, రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షను దాదాపు రెండు సార్లు వాయిదా వేసి ఇటీవల మూడోసారి పరీక్ష నిర్వహించారు. ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరిగిన విషయం తెలిసిందే.

అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్

గ్రూప్-1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల కాగానే మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకే ప్రకటించిన విధంగా అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతి పేపర్‌నూ 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను మధ్యాహ్నం 2. 30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌ను అన్ని భాషల్లో రాసేందుకు అభ్యర్థుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.

Next Story