ఢిల్లీలో ధర్నాకు ఏర్పాట్లు.. సీఎం కేసీఆర్ హాజరుపై నో క్లారిటీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-09 00:15:20.0  )
ఢిల్లీలో ధర్నాకు ఏర్పాట్లు..  సీఎం కేసీఆర్ హాజరుపై నో క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో ధర్నాకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. పార్టీ ప్రజాప్రతిధులతో పాటు రాష్ట్ర కమిటీ, ముఖ్యనేతలను తరలించి నిరసన తెలపాలని భావిస్తోంది. కేంద్రానికి ధాన్యం కొనుగోళ్ల ఆవశ్యకతను, రైతుల గోడును తెలియజేసేందుకు సన్నద్ధమవుతోంది. ధర్నా పర్యవేక్షణ బాధ్యతలను ఎంపీలకు అప్పగించింది. ఇప్పటికే ఢిల్లీలో ప్రజాప్రతినిధులకోసం హోటళ్లను బుక్ చేశారు. నేడు, రేపు ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి చేరుకునేలా విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 11న ఢిల్లీకి వెళ్తున్నారు.

కేంద్రంపై యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మరింత ఒత్తిడిని పెంచేందుకు ఈ నెల 11న ఢిల్లీలోని ధర్నాకు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 మందికిపైగా తరలివెళ్లేందుకు ఎమ్మెల్యేలు టికెట్ బుక్ చేసినట్లు సమాచారం. కొన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కువ మందిని తరలించేందుకు రైల్ టికెట్లను బుక్ చేసినట్లు తెలిసింది. ఈ నెల, 9, 10 తేదీల్లో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు సైతం చేశారు. సోమవారం ఉదయం9 గంటల వరకు పార్టీ శ్రేణులంతా పాల్గొనేలా ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేయగా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎంపీలు పర్యవేక్షణ చేస్తున్నారు. పార్టీ వర్గాలు 1500 మంది ధర్నాల్లో పాల్గొంటారని పేర్కొంటున్నప్పటికీ ఆసక్తి ఉన్నవారు తరలివెళ్లేందుకు టికెట్లను బుక్ చేసుకున్నారు. వసతి కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు ఫోన్లు చేసి విజ్ఞప్తులు చేస్తున్నారు.

ధర్నాలో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీలు విధిగా పాల్గొనాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు తమ ప్రధాన అనుచరులను, స్థానిక ప్రజాప్రతినిధులను సుమారు 100కు పైగా తీసుకెళ్తున్నారు. అందుకు సంబంధించిన వసతి సౌకర్యాలను కల్పించేందుకు ఢిల్లీలో ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. భారీగా తరలించి ఎమ్మెల్యేలు సైతం తమ బలాన్ని చూపుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. సుమారు 1500 నుంచి 3వేల వరకు పాల్గొనే అవకాశం ఉందని అంచనా. అందుకు సంబంధించిన బస, భోజనం, బస ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు సమాచారం.

11న హస్తినకు కేటీఆర్...

ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొనేందుకు ముందుగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. సోమవారం ఉదయం వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్ వద్ద నిర్వహించే ధర్నా ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ప్రజాప్రతినిధులకు సైతం ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టనున్నారు.

ధర్నాలో కేసీఆర్ పాల్గొనడం ఇంకా సందిగ్ధమే...

పంటినొప్పితో వైద్య పరీక్షల కోసం సీఎం కేసీఆర్ ఈ నెల 3న ఢిల్లీ వెళ్లారు. అక్కడే ఉన్నారు. రాష్ట్రంలో వడ్లపై ఈ నెల 4నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ శ్రేణులంతా పాల్గొంటున్నారు. కేసీఆర్ ఢిల్లీలో ఉండటంతో పాల్గొనలేకపోయారు. అయితే ఈ నెల 11 ఢిల్లీలో ధర్నా జరుగుతుండటంతో పాల్గొంటారా? లేదా? అనేదానిపై నేటికీ స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఎవరూ నోరుమెదపడం లేదు. అవసరం అయితే పాల్గొంటారని మాత్రం పేర్కొంటుండటం గమనార్హం.

Advertisement

Next Story