పసుపు రైతులు నా నామినేషన్​ డిపాజిట్ చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నా

by Disha Web Desk 15 |
పసుపు రైతులు నా నామినేషన్​ డిపాజిట్ చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పసుపు రైతులు తన నామినేషన్​ డిపాజిట్ చెల్లించడం అదృష్టంగా భావిస్తున్నా అని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పసుపు రైతులతో కలిసివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్లకు చెందిన పసుపు రైతులతో కలిసి నామినేషన్ కోసం తరలివచ్చారు. పసుపు రైతులు వెంట రాగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. 2019 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ తో ఎన్నికలకు వెళ్లిన ధర్మపురి అరవింద్ మోడీ చేత ప్రకటన చేయించి కొత్తగా పసుపు బోర్డు సాధించారు.

దాంతో ఎంపీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్ రుసుము (డిపాజిట్) రూ.25 వేలను పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఇటీవల తన ఇంటివద్దే సుమారు 40 క్వింటాళ్ల పసుపును క్వింటాలుకు రూ.19500 లకు అమ్ముకున్న రైతు వెల్మ రమేష్ బీజేపీ అభ్యర్థి అర్వింద్ నామినేషన్ ను ప్రపోజ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ... గడిచిన ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ రైతులు పూర్తిగా మద్దతు ప్రకటించారని, వారిచ్చిన నమ్మకంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తానని అన్నారు. పసుపు రైతుల సమక్షంలో వాళ్ల ఆశీర్వాదంతో నా ఎలక్షన్ డిపాజిట్ కూడా పూర్తిగా పసుపు రైతులు సమకూర్చి ఇవ్వటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో జగిత్యాల పసుపు, మామిడి పంటలకు ప్రసిద్ధి అయితే, కోరుట్ల నియోజకవర్గంలో పసుపు పంటతోపాటు మొక్కజొన్న, చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. అలాగే అంకాపూర్ గ్రామం చుట్టుపక్కల విత్తన కేంద్రాలు ఉన్నాయని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రాసీసింగ్ యూనిట్లు, స్టోరేజ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. వీటిల్లో మహిళా గ్రూపులను కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పారు. గల్ఫ్​ వలసలు ఆపుతామని అన్నారు. పైవన్నీ బీజేపీ ఎజెండాగా ఎన్నికల్లో ముందుకు వెళ్తామని చెప్పారు.

Next Story

Most Viewed