నిజామాబాద్ అర్బన్ పై పెత్తనం ఎవరిది…?

by Kalyani |
నిజామాబాద్ అర్బన్ పై పెత్తనం ఎవరిది…?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ అర్బన్ రాజకీయం రసవత్తరంగా మారుతుంది. అర్బన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ మిశ్రమమైన తీర్పును ఇచ్చిన విషయం తెల్సిందే. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ప్రజలు అసెంబ్లీకి పంపారు. అంత వరకు బాగానే ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వారిదే పెత్తనం కాగా ఓడిన చోట ఓడిన అభ్యర్థులకే పెత్తనాన్ని అప్పగించారు.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలపై అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఓడిన ముత్యాల సునీల్ రెడ్డి, పొద్దుటూరి వినయ్ రెడ్డిలదే హవా కొనసాగుతుంది. ఇప్పటికి అక్కడ ఎమ్మెల్యేలను కాదని వారే అధికారం చెలాయిస్తున్నారు. అధికారులతో సమీక్షలతో పాటు పాలన వ్యవహరాల్లో జోక్యం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ కల్చర్ కేవలం ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకే పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయో లేదో అదే జాడ్యం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి పాకినట్లయింది.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అధికారం మూడు ముక్కలాటగా మారిందని చెప్పాలి. అర్బన్ నియోజకవర్గంలో దశాబ్ధం తర్వాత బీజేపీ జండా ఎగిరి నప్పటికీ ఇక్కడి నుంచి కాంగ్రెస్ పెత్తనం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆదరించిన అర్బన్ ఓటర్లు పార్లమెంట్ కు వచ్చే సరికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పటీకి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ ఆలీకి ప్రభుత్వ సలహాదారు పదవి దక్కడం అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కడంతో ఇద్దరు అధికార పార్టీ నేతలుగా అధికారాన్ని చెలాయించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అధికారులతో పలుమార్లు సమీక్ష నిర్వహించారు.

అయితే అర్బన్ నియోజకవర్గం నుంచి తానే ఓటమి చెంది ఇంచార్జిగా ఉన్న నేపథ్యంలో షబ్బీర్ ఆలీ అర్బన్ పైనే నజర్ వేశారు. అందుకోసమే ఇక్కడ క్యాంప్ కార్యాలయం తెరిచారని చెప్పాలి. రేపోమాపో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకలాపాలను అర్బన్ నుంచి ప్రారంభించడం ఖాయమని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇక్కడ అధికారులు ఎమ్మెల్యే మాట వినాలా, లేదా ఎమ్మెల్సీ మాట వినాలా కాదు కూడదు అంటే ప్రభుత్వ సలహాదారు మాట వినాలా అనే సంశయం వ్యక్తమౌతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీ నాయకులుగా పెత్తనం చెలాయిస్తుండగా ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులుగా అధికారం చెలాయించడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యేకు గడ్డు పరిస్థితులేనని చెప్పాలి.

Next Story

Most Viewed