కేసీఆర్ ను గద్దె దించాలనే గద్దర్ చివరి కోరికను తీరుస్తాం

by Sridhar Babu |   ( Updated:2023-08-25 15:24:08.0  )
కేసీఆర్ ను గద్దె దించాలనే గద్దర్ చివరి కోరికను తీరుస్తాం
X

దిశ, కామారెడ్డి క్రైమ్ : కేసీఆర్ ను గద్దె దించాలని నినదించిన గద్దర్ చివరి కోరికను తీరుస్తాం అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూ తలూగించిన గద్దర్ లాంటి ప్రజా యుద్ధనౌకను తొమ్మిదిన్నరేళ్లుగా ప్రగతి భవన్ గేటు దాటానివ్వలేదని గుర్తు చేశారు. కేసీఆర్ ను ఇక్కడ ఓడించి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తామన్నరు. గజ్వేల్ లో 9, 10 లక్షలిచ్చి భూములు తీసుకుని కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో కూడా బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా దిగుతుందన్నారు.

నేనేం పీకానని కేటీఆర్​ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, తెలంగాణపై ప్రకటన చేసేలా చూశానని, అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్​ దీక్ష విరమింపజేశానని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కామారెడ్డిలో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయించిన ఘనత తనదేనని అన్నారు. భూములు అమ్ముకోవడమే కేసీఆర్ అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. డబుల్ ఇళ్ల నిర్మాణంలో పైనుంచి కేసీఆర్ కు, కింద నుంచి ఎమ్మెల్యేకు కమీషన్ ఇవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి గతంలో ఎక్కడా ఇండ్లు లేవని, ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించుకున్నారన్నారు.

శ్రీకాంత చారి మరణం చూసి చలించిన సోనియాగాంధీ ఇంకెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని పార్లమెంటులో అందరి నోళ్లు మూయించి తెలంగాణ బిల్లు పాస్ చేయించారని, అలాంటి శ్రీకాంత చారి తల్లికి కేసీఆర్ గౌరవం ఇవ్వలేదన్నారు. కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలి అన్నారు. తెలంగాణ వచ్చేనాటికి 10 వేల కోట్ల మిగులు బడ్జెట్ చూపిస్తే నేడు ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేసి పుట్టబోయే బిడ్డపై 2 లక్షల అప్పు పెట్టారని ఆరోపించారు. సమావేశంలో నియోజక వర్గంలో ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story