మూడు రోజుల్లోనే నష్టపరిహారం ప్రకటించాం

by Sridhar Babu |   ( Updated:2024-03-21 09:43:56.0  )
మూడు రోజుల్లోనే నష్టపరిహారం ప్రకటించాం
X

దిశ, భిక్కనూరు : గత ప్రభుత్వ తొమ్మిదిన్నర సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలనలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్న పాపాన పోలేదని, కాని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం తక్షణమే స్పందించి పంటలను పరిశీలించి మూడు రోజుల్లోనే నష్టపరిహారం ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాలలో జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు, కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వడగండ్ల వాన పడిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని, మరుసటి రోజే తాను వచ్చి 10 గ్రామాల్లో పంటలను పరిశీలించగా రాత్రి పొద్దు పోవడం వలన, ఇంకా మూడు గ్రామాలు మిగిలిపోయాయని, వాటిని మంత్రితో కలిసి ఇవాళ కవర్ చేసినట్టు స్పష్టం చేశారు.

సరిగ్గా 11 నెలల క్రితం అకాల వర్షాలతో ధాన్యం దెబ్బ తినడంతో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, రాజంపేట మండలాల్లో పర్యటించినట్టు తెలిపారు. రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని ఆదుకోవాలని, పరిహారం అందజేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా అప్పటి సీఎం కేసీఆర్ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరించాడు తప్ప నయా పైసా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. పంటల సాగుకు సుమారు 25 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని, కానీ ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టానికి, ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయం మీకు సరిపోదన్నారు. కానీ తమ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఎక్కువ మొత్తంలో పరిహారం అందజేసి బాధిత రైతులను ఆదుకుంటుందన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, జిల్లా ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చిట్టెడి సుధాకర్ రెడ్డి, పండ్ల రాజు, అందె దయాకర్ రెడ్డి, రామేశ్వర్ పల్లి వీడీసీ అధ్యక్షులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, పి.మహిపాల్ రెడ్డి, కల్లూరి సిద్ధ రాములు, జేపీ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story