పరస్పర సహకారమే మన చెలిమికి బలిమి : మోడీ, మయిజ్జుల ప్రకటన

by Y. Venkata Narasimha Reddy |
పరస్పర సహకారమే మన చెలిమికి బలిమి : మోడీ, మయిజ్జుల ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : పరస్పర సహకారం.. స్వేచ్చాయుత వాణిజ్యంతో రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధాని నరేంద్రమోడీ, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జులు సంయుక్త ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఇరుదేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భేటీ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేను ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అదే సమయంలో రూపే కార్డు ద్వారా చెల్లింపును మాల్దీవులలో ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జూ తొలిసారిగా ఇలాంటి లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. అడ్డు, బెంగళూరులో దౌత్య కార్యాలయాల ఏర్పాటుపై ఈ ఇద్దరు నేతలు చర్చించారు. ఈసందర్భంగా మాల్దీవులతో భారత్ కున్న చిరకాల స్నేహం గురించి మోదీ గుర్తు చేశారు. ద్వీప దేశానికి కష్టమొస్తే.. ఆదుకునే విషయంలో ముందుండే తొలి దేశం భారత్ అని పేర్కొన్నారు. దానిని నిర్ధారించేలా కొవిడ్ వ్యాక్సిన్ల సరఫరా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేయడం గురించి ప్రస్తావించారు. మన బందం శతాబ్దాల నాటిదని, భారత్.. మాల్దీవులకు అతి దగ్గరి పొరుగు దేశం, సన్నిహిత మిత్ర దేశమని మోడీ స్పష్టం చేశారు.

మా నైబర్ హుడ్ పాలసీ, సాగర్ విజన్ లో మాల్దీవులది కీలక స్థానమని చెప్పారు. మాల్దీవుల కోసం దేశం కోసం స్పందించే దేశాల్లో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఒక పొరుగు దేశంగా ఎల్లప్పుడూ మా బాధ్యతలు పూర్తిగా నిర్వహించామని, మన సహకారానికి వ్యూహాత్మక దిశానిర్దేశం చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. మాల్దీవుల ప్రజల ప్రాధాన్యాలకు మేం ఎంతో విలువిస్తామని, ఈ క్రమంలోనే ట్రెజరీ బిల్లుల విషయంలో ఉపశమనం కల్పించామని, మీ అవసరాలకు అనుగుణంగా.. 400 మిలియన్ల డాలర్ల, 3 వేల కోట్ల రూపాయల కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ పై సంతకం చేశాం" అని మోడీ వెల్లడించారు. అలాగే ఒక ఎయిర్ పోర్టు ప్రారంభించామని, 700 హౌసింగ్ యూనిట్స్ ను నిర్మించి ఇచ్చామని చెప్పారు. ఏకథా హార్బర్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, శ్రేయస్సు కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయన్నారు. కొలంబోలో వ్యవస్థాపక సభ్యులుగా సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌లో మాల్దీవులు చేరడానికి స్వాగతం పలుకుతున్నట్లు ప్రదాని మోదీ తెలిపారు. పోర్టు నిర్మాణానికి మద్దతు ఇవ్వాలనే ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.

ఈసందర్భంగా ముయిజ్జు మాట్లాడుతూ.. తమ దేశంలో పెట్టబడులు పెంచేందుకు భారత్ తో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమ టూరిజం మార్కెట్ కు భారత్ అతిపెద్ద వనరు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో టూరిస్టుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story