అందరికీ ఆదర్శం సాలాయిగూడా…44 ఏళ్లుగా మందు, మాంసానికి దూరం

by Kalyani |
అందరికీ ఆదర్శం సాలాయిగూడా…44 ఏళ్లుగా మందు, మాంసానికి దూరం
X

దిశ, ఉట్నూర్ : నాగరికత ప్రపంచానికి అలవాటు పడ్డ ప్రజలు రోజు రోజుకు తమ ఆలోచనలు, ఆచార వ్యవహారాలను మార్పులు చేసుకుంటూ సాంకేత వైపు పరుగెడుతుండడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటూ జీవిస్తుండడం మనకు తెలిసిందే. కానీ వీటన్నింటికి భిన్నంగా ఆ ఆదివాసీ గూడెం ఉంది. ఆ గూడెం పచ్చని చెట్లతో ఎప్పుడు కళాకాలాడుతుంటుంది. గత 44 ఏళ్లుగా మద్యం, మాంసంకు దూరంగా ఉంటూ మిగిత గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.


మండలంలోని నర్సాపూర్(బీ) పంచాయతీ పరిధిలోని సాలాయిగూడా కొలాం గిరిజన గూడెం. గ్రామం ఏర్పడి 60 ఏళ్లు అవుతుంది. సుమారుగా 80 కొలాం గిరిజనులు కుటుంబాలు, సుమారుగా 400 మంది వరకు జనాభా నివాసం ఉంటున్నారు. కేవలం ప్రధానంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామం ఏర్పడిన తర్వాత గ్రామంలో నిత్యం మద్యానికి బానిసై తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గూడానికి చెందిన పెద్దలు రచ్చబండ నిర్వహించి గ్రామస్తులందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఏర్వరు మందు తాగవద్దని 1980 సంవత్సరం నుంచి తీర్మానం చేశారు. మందు తాగిన, మాంసం తిన్న వారిని గ్రామ బహిష్కరణ విధిస్తామని తేల్చిచెప్పడంతో అప్పటి నుంచి గ్రామంలో ఏ కుటుంబ సభ్యులు సైతం మాంసం తినరు...మందు తాగరు.

ఎప్పుడు పచ్చదనమే...


గ్రామంలో ఏ ఇంటికి వెళ్లిన ఇంటి పరిసర ప్రాంతాల్లో పూల చెట్లు, ఔదల మొక్కలు, షోకాజ్ చెట్లు, తమకున్న వ్యవసాయ భూముల్లో కూరగాయల సాగుతో పాటు పండ్ల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలో ఎప్పుడు పచ్చదనమే దర్శనం ఇస్తుంది. గ్రామంలో సీసీ రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు నాటడంతో ఆహ్లదకరంగా మారింది. దీంతో గ్రామానికి వెళ్లిన అందరినీ ఆకట్టుకుంటుంది.

నిత్యం భక్తి మార్గంలో ప్రజలు...

సాలాయిగూడా గ్రామంలో 19 ఏళ్ల క్రితం శ్రీ శ్రీ శ్రీ సద్గురు పూలాజీ బాబా ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తి మార్గం కోసం ప్రజలు ఉదయం, సాయంత్రం ధ్యాన కేంద్రానికి వెళ్లి భజనలు, భక్తి మార్గం శ్లోకాలు చదువుతున్నారు. దీనికి తోడుగా గ్రామంలో హనుమాన్ టెంపుల్ సైతం గ్రామస్థులే చందాల రూపంలో కట్టించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేకంగా నిత్యం పూజలు చేస్తూ భక్తి మార్గంలో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రామంలో శాటిలైట్ సెంటర్ స్కూల్

కొలాం తెగకు చెందిన గిరిజనులకు ప్రత్యేకంగా చదువుకునేందుకు ఈ గ్రామంలో శాటిలైట్ సెంటర్ స్కూల్ ను 2004లో ఏర్పాటు చేశారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువు నేర్పిస్తున్నారు.

ఇద్దరు సీఎంల సందర్శన...

మండలంలోని సాలాయిగూడా గ్రామం అందరికీ ఆదర్శంగా నిలువడంతో ఇప్పటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు సందర్శించారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1986 సందర్శించారు. అదే విధంగా 2002లో నారా చంద్రబాబు నాయుడు సైతం గ్రామాన్ని సందర్శించారు. గ్రామమంటే ఇలా ఉండాలని అభివర్ణించారు.

కట్టుబాటును ఆచరిస్తున్నాం

- గ్రామస్తులు

మా తాతల నుంచి మా గూడెంలో మాంసం, మందు తాగం. పెద్దలు చెప్పిన కట్టుబాటును ఇప్పటి వరకు ఆచరిస్తున్నాం. ఇప్పటివరకు గ్రామంలో ఎవరూ కూడా కట్టుబాటును ధిక్కరించలేదు. అందరూ ఐక్యమత్యంతో ఉంటాం. మా గూడెం ఇతర గూడాలకు ఆదర్శంగా నిలిచింది. దీనికి తోడుగా అందరూ ఎప్పుడు భక్తి మార్గం లో నడుస్తాం. నిత్యం పూలాజీ బాబా ధ్యాన మందిరం తో పాటు హనుమాన్ టెంపూల్లో ప్రతి రోజు పూజలు, ధ్యానలు చేస్తూ భక్తితో మెలుగుతామని గ్రామస్థులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed