ఆ గ్రామ రైతులు అందరికీ ఆదర్శం.. సొంతంగా రోడ్డు మరమ్మతులు

by Nagam Mallesh |
ఆ గ్రామ రైతులు అందరికీ ఆదర్శం.. సొంతంగా రోడ్డు మరమ్మతులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదిరి చూసి మోసపోకుమా.. నిజం తెలిసి నిదుర పోకుమా.." అనే ఓ తెలుగు సినిమా పాటలోని వాస్తవాన్ని ఆ గ్రామ రైతులు గుర్తించారేమో. అందుకే అధికారులు వచ్చి ఏదోచేస్తారని వాళ్లు ఎదురుచూడలేదు. తమ సమస్యను తామే సంఘటితంగా పరిష్కరించుకున్నారు. నరకం చూపిస్తున్న రోడ్డును స్వచ్ఛందంగా బాగు చేసుకున్నారు. రైతులు సొంత డబ్బులు పోగేసుకొని రోడ్డు మరమ్మతులు చేసుకున్నారు. ట్రాక్టర్లు మాట్లాడుకుని రోడ్డును బాగు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్ సీ కాలనీ నుంచి గ్రామ శివారులోని పంట పొలాల వరకు ఉన్న రోడ్డు ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో అధ్వాన్నంగా మారింది. రోడ్డుపై నడక నరక ప్రాయంగా మారింది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. అయినా పట్టించుకోలేదు.ఇక లాభం లేదనుకుని తమకు తాముగా ముందుకొచ్చి రొడ్డును బాగు చేసుకుందామని నిర్ణయానికొచ్చారు. రైతులంతా తలా కొంత సొంత డబ్బులు పొగేసుకొని రోడ్డును బాగు చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. దాదాపు 1500 మీటర్లు (కిలోమీటరున్నర) వరకు మొరం రోడ్డు వేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు రొండ్ల రవి, నర్సరెడ్డి, దండు నర్సయ్యలు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల కోసం వెళ్లేందుకు ఎంతో ఇబ్బందిగా మారుతోందన్నారు. నాట్లు వేసుకునే సమయంలో ఈ రోడ్డుపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ నడవడంతో పాటు నిత్యం రైతుల వాహనాల రాకపోకలుంటాయన్నారు. వెహికిల్ అదుపు తప్పి రోడ్డుపై రెండు మూడు చోట్ల పడుతూ, లేస్తేగాని పొలానికి చేరుకోలేని పరిస్థితున్నాయని రైతులు అన్నారు. చాలామంది రైతులు బైక్ పై నుంచి పడి గాయాల పాలైన సంఘటనలున్నాయన్నారు.

ఇదే రోడ్డులో గ్రామ దేవతలు పోచమ్మ , ఎల్లమ్మ ఆలయాలు కూడా ఉన్నాయని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎల్లమ్మ ఆలయానికి ప్రజలు వస్తుంటారన్నారు. తమ పరిధిలో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా రోడ్డుకు మరమ్మతులు చేసినా, ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం జరగాలంటే బీ టీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సుమారు రూ. 1.50 లక్షలకు పైగా ఖర్చును రైతులే భరించుకున్నారు. రైతుల చొరవ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో మధు, భాస్కర్, మోహన్ రెడ్డి, రమేష్, సురేష్, గంగారాజం, తదితరులు రైతులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed