వనమహోత్సవం లక్ష్య సాధనకు కృషి చేయాలి.. కలెక్టర్

by Sumithra |
వనమహోత్సవం లక్ష్య సాధనకు కృషి చేయాలి.. కలెక్టర్
X

దిశ, నిజామాబాద్ సిటీ : వనమహోత్సవ కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వనమహోత్సవం కార్యక్రమం పై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ శుక్రవారం డీఎఫ్ఓ వికాస్ మీనాలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ప్రస్తుత 2024 సీజన్ లో ఆయా శాఖల వారీగా వనమహోత్సవంలో భాగంగా నాటాల్సిన మొక్కలకు సంబంధించిన లక్ష్యాలను గుర్తు చేస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేలా చొరవ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున విరివిగా మొక్కలు నాటాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, నిర్ణీత గడువు లోపు లక్ష్యం పూర్తి చేయాలని సూచించారు.

లక్ష్యాల సాధన కోసం అనువైన స్థలాలను గుర్తిస్తూ, మొక్కలు నాటడంతో పాటు జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని, ఏకకాలంలో ఈ పనులు జరగాలని ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతో పాటు, చెరువులు, కాలువ కట్టలపైనా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటి సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు వారాల్లోపు నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వంద శాతం మొక్కలు నాటించాలని గడువు విధించారు. వనమహోత్సవ కార్యక్రమం ప్రగతి గురించి రోజు వారీగా నివేదికలు సమర్పించడంతో పాటు, వివరాలను వెంటదివెంట ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పచ్చదనం, పర్యావరణ పరిరక్షణతో ముడిపడిన వనమహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ప్రాధాన్యతనిస్తూ లక్ష్యాల సాధనకై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకుని తదనుగుణంగా అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. మొక్కలు నాటే కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా కార్యక్రమాలను రూపొందించిన సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని, గ్రామీణ ప్రాంతాలలో మండల ప్రత్యేక అధికారులను, పట్టణ ప్రాంతాలలో మున్సిపల్ పాలకవర్గాల సభ్యులను భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story