దేవర స్టైల్ దారుణ హత్య..వేర్వేరు ఘటనల్లో రెండు హత్యలు

by Naveena |
దేవర స్టైల్ దారుణ హత్య..వేర్వేరు ఘటనల్లో  రెండు హత్యలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 12: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు హత్యలు జరిగాయి.ఈ జంట హత్యల ఘటన బాన్సువాడ పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది. బాన్సువాడ కల్కి చెరువుకట్టపై గుర్తు తెలియని మహిళ (50) ను అతి దారుణంగా హత్య చేయగా.. మరోచోట బాన్సువాడ పట్టణంలోని సరస్వతి మందిరం సమీపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో వాచ్ మెన్ గా పనిచేస్తున్న వెంకటేష్ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ రెండు హత్యలు ఒకే రోజు రెండు వేరువేరు ప్రాంతాల్లో జరగడం కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కల్కి చెరువు వద్ద లభ్యమైన మహిళ మృతదేహంపై గాయాల ఆనవాళ్లు చూపరులను గగుర్పాటుకు గురి చేసేలా ఉన్నాయి. మహిళను చేతులు కట్టేసి ముఖంపై, నుదుటిపై, చెంపలపై X అకారంలో కత్తితో లోతుగా గాట్లు పెట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆ మహిళను అతి దారుణంగా హింసించి కత్తితో బలమైన గాయాలు చేసి చంపినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన మహిళ యాచకురాలేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను సంఘటన స్థలంలోనే హత్య చేశారా? లేదంటే ఇతర ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కల్కి చెరువు దగ్గరకు తెచ్చిపడేసారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

మహిళ ముఖంపై ఉన్న కత్తి గాట్లు చూస్తే పలు అనుమానాలకు దారితీస్తోంది. మహిళను ఎవరైనా గుప్తనిధుల కోసం హత్య చేశారేమోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్థానికుల్లో ఈ హత్య తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. కొత్తగా నిర్మాణమవుతున్న భవనంలో వాచ్ మన్ గా పనిచేసే వెంకటేష్ ను గొంతు కోసి హత్య చేశారు. సంఘటన స్థలంలో రక్తపు మరకలతో ప్లే కార్డ్స్ కనిపించడంతో, సంఘటన స్థలంలో హత్యకు ముందు గుర్తుతెలియని వ్యక్తులు పేకాట ఆడి ఉంటారని, వారి వాచ్ మన్ ను హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాచ్ మన్ పనిచేసే వ్యక్తిని హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు జరిగిన ఈ రెండు హత్యలు కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఈ రెండు హత్యలు పోలీసులకు సవాల్ గా మారాయి. హత్యకు గల కారణాలు, హత్య చేసిన వ్యక్తులు ఎవరిని విషయాలు పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed