నాడు పసుపు బోర్డు.. నేడు షుగర్ ఫ్యాక్టరీ.. ఎన్నికల వేళ తెరపైకి గల్ఫ్ బోర్డు

by Disha Web Desk 1 |
నాడు పసుపు బోర్డు.. నేడు షుగర్ ఫ్యాక్టరీ.. ఎన్నికల వేళ తెరపైకి గల్ఫ్ బోర్డు
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఇందూరు పార్లమెంట్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. గతంలో పసుపు బోర్డు హామీ‌తో నిజామాబాద్ సెగ్మెంట్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఎన్నికల్లో రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడంతో ఏకంగా ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపెట్టింది. ఈ నియోజకవర్గంలో సాధారణంగా ప్రజల సమస్యలు మాత్రమే కాకుండా రైతుల సమస్యలే ఎజెండాగా పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతూ వస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఎన్నికల వేల హామీలు, బాండ్ పేపర్లు రాసి ఇస్తూ రైతుల దృష్టిని ఆకర్శించి రాజకీయ లబ్ధి పొందుతున్నాయి. మిగిలిన సెగ్మెంట్‌లతో పోల్చితే ఇక్కడ రైతులతో పాటు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు బీడీ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దాంతో లీడర్లు పోటాపోటీ హామీలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ప్రధాన అస్త్రంగా నిలవగా తాజాగా ఎన్నికల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం, గల్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రధాన హామీలుగా ఉన్నాయి.

తెరపైకి షుగర్ ఫ్యాక్టరీ.. గల్ఫ్ బోర్డు

నిజాం చక్కర ఫ్యాక్టరీలను తెరిపించాలని డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ ఎన్నికల వేల మరోసారి తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో 60 శాతానికి పైగా గ్రామీణ ఓటర్లు ఉండగా అందులో రైతులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉండడంతో ప్రధాన పార్టీలు తమను గెలిపిస్తే మూతపడిన బోధన్, ముత్యంపేట ఫ్యాక్టరీలు రీఓపెన్ చేపిస్తామని ఇప్పటికే హామీలు ఇచ్చారు. మరోవైపు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో వారి ఓటు బ్యాంకుకు లీడర్లు గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇది వరకే పలు పార్టీల నాయకులు షెడ్యూల్ రావడానికి అన్న ముందే గల్ఫ్ దేశాలలో పర్యటించి అక్కడ ఉన్న జేఏసీ నాయకుల మద్దత్తు కోరారు.

రైతులు, గల్ఫ్ కుటుంబాల ఓట్లు కీలకం

ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో రైతులతో పాటు గల్ఫ్ కార్మికుల కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి గల్ఫ్ వెళ్లిన వారి కుటుంబాలలో చాలా వరకు మహిళలు బీడీ‌లు చూడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. అయితే, గత ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభించాయి. ఉపాధి కోసం వెళ్లిన వారి యోగ క్షేమాల విషయం‌తో పాటు గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు బాసటగా నిలవలేక పోయాయి. దీంతో గల్ఫ్ జేఏసీ‌లు, ప్రవాసి మిత్ర వంటి సంఘాలు కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తూనే సాయం అందిస్తున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశం తెర‌పైకి రావడంతో మరోసారి రైతులతో పాటు గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు కీలకం ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ఎన్నికల్లో రైతులు, గల్ఫ్ కుటుంబాల ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలబడతారు అన్నది చూడాల్సి ఉంది.



Next Story

Most Viewed