‘నాలుగో విడత’ ప్రచార ఘట్టానికి తెర.. 96 స్థానాల్లో 1717 మంది పోటీ

by Hajipasha |
‘నాలుగో విడత’ ప్రచార ఘట్టానికి తెర.. 96 స్థానాల్లో 1717 మంది పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల ప్రచార ఘట్టం శనివారంతో ముగిసింది. ఈ దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 96 లోక్‌సభ స్థానాల్లో మే 13న ఓటింగ్ జరగనుంది. మొత్తం 1,717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ప్రచార సమయం ముగియడంతో ఆయా లోక్‌సభ స్థానాల పరిధిలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ మొదలైంది. 96 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 4,264 నామినేషన్లు దాఖలవగా.. తెలంగాణ నుంచి అత్యధికంగా 1488 నామినేషన్ ఫామ్‌లు ఈసీకి వచ్చాయి. ఇక ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి 1103 నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగో విడత ఎన్నికల్లో ఒక్కో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు సంఖ్య 18 అని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది.

కీలక అభ్యర్థులు వీరే..

పోలింగ్ జరగనున్న మొత్తం 96 లోక్‌సభ స్థానాలకుగానూ ఏపీలో 25, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, బిహార్‌లో 5, జార్ఖండ్, ఒడిశాలలో చెరో 4, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక స్థానం ఉన్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థులలో.. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (కనౌజ్), నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా (శ్రీనగర్), గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్), అధిర్ రంజన్ చౌదరి (బహరంపూర్), మహువా మొయిత్రా (కృష్ణానగర్), శతృఘ్న సిన్హా (అసన్సోల్), అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), వైఎస్ షర్మిల (కడప) ఉన్నారు.

ఫేజ్ 3 పోలింగ్ డేటా ఇదీ..

మే 7న జరిగిన మూడో విడత ఎన్నికల ఓటింగ్ గణాంకాలను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శనివారం ప్రచురించింది. 93 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో 65.68 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించింది. 66.89 శాతం మంది పురుషులు, 64.41 శాతం మంది మహిళా ఓటర్లు, 25.2 శాతం మంది థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. రాష్ట్రాల వారీగా అసోంలో అత్యధికంగా 85.45 శాతం ఓటింగ్ నమోదవగా, గోవాలో 76.06 శాతం ఓటింగ్‌ జరిగిందని వెల్లడించింది. బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో వరుసగా 59.15 శాతం, 57.55 శాతం మేర అత్యల్ప ఓటింగ్ నమోదైంది.

Advertisement

Next Story