‘ఇండియా’కు లేఖ రాస్తే ఈసీ స్పందించింది.. ఇదేం చిత్రం : ఖర్గే

by Shamantha N |
‘ఇండియా’కు లేఖ రాస్తే ఈసీ స్పందించింది.. ఇదేం చిత్రం : ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికల సంఘం పంపిన లేఖపై స్పందించారు. ఇండియా కూటమిని ఉద్దేశించిన లేఖకు ఎన్నికల సంఘం సమాధానమివ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన మతపరమైన, కులతత్వ ప్రకటనలకు ఈసీ ఎందుకు స్పందించట్లేదని అడిగారు. ఎన్నికల సంఘం రాసిన లేఖపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేలా అధికార పార్టీ నాయకులు చేస్తున్నవిద్వేష ప్రసంగాలపై ఈసీ చర్య తీసుకోకపోవడం అయోమయానికి గురిచేస్తుందన్నారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటింగ్ డేటాలోని వ్యత్యాసాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మే 10న 'ఇండియా' కూటమికి చెందిన వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు. శక్తివంతమైన ప్రజాస్వామ్య సంస్కృతి, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తమ అందరి లక్ష్యమని, పోలింగ్ డాటా వ్యత్యాసాలకు వ్యతిరేకంగా అందరూ తమ స్వరాన్ని పెంచాలని కూటమి నేతలను ఖర్గే తన లేఖలో కోరారు.

పోలింగ్ డేటాలోని వ్యత్యాసాలపై ఖర్గే వ్యక్తం చేసిన అనుమానాలు, ఎన్నికల ప్రక్రియ చిత్తశుద్ధిని ప్రశ్నించడంపై ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఇది ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై జరిపిన దాడిగా పేర్కొంది. ఈ మేరకు ఖర్గేకు ఈసీ ఖర్గేకు లేఖ రాసింది.

పోలింగ్‌ డేటాపై కాంగ్రెస్‌ బాధ్యతారహిత ప్రకటనలు విస్తుగొలుపుతున్నాయని పేర్కొంద ఈసీ. నిష్పక్షపాతంగా జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో గందరగోళం, అడ్డంకులు సృష్టించేందుకు.. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. ఇలాంటి వ్యాఖ్యలు పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అంది. ఎన్నికల వ్యవస్థను నిరుత్సాహపరుస్తాయని.. ఖర్గే లేఖ అత్యంత అవమానకరం అని పైర్ అయ్యింది. ఈ ఆరోపణలన్నీ అపోహలే అని.. ఓటింగ్‌ డేటా సేకరణ, పోలింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి లోపాలు జరగలేదని ఈసీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed